కోల్‌కతా: లక్నో సూపర్ గెయింట్స్ స్పిన్నర్ దిగ్వేశ్ రథీ.. మళ్లీ వివాదాస్పద రీతిలో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఐపీఎల్లో మంగళవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో అతను వికెట్ తీసిన తర్వాత కొత్త తరహాలో సంబరాలు చేసుకున్నాడు. తన అభిమాన స్పిన్నర్ సునిల్ నరైన్‌ను ఔట్ చేసిన తర్వాత దిగ్వేశ్ గ్రౌండ్‌పై రాస్తున్నట్లుగా సెలబ్రేట్ చేసుకున్నాడు. నోట్‌బుక్ సెలబ్రేషన్ బదులుగా.. మైదానంలో గడ్డిమీద పేరు రాస్తూ సంబురాలు చేసుకొని మళ్లీ వివాదంలో చిక్కుకున్నాడు. ఇప్పటికే పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రియాన్ష్ ఆర్యాను ఔట్ చేసి నోట్‌బుక్ సంబరాలు చేసుకున్న రథీకి జరిమానా వేసిన విషయం తెలిసిందే. ఈసారి ఐపీఎల్లో రెండు సందర్భాల్లో అతనికి జరిమానా విధించారు. కొత్త తరహాలో సంబరాలు చేసుకున్న దిగ్వేశ్కు ఇప్పుడు బీసీసీఐ ఎటువంటి శిక్ష వేస్తుందో చూడాల్సిందే.
Digvesh Rathi celebration 😂 #KKRvsLSG pic.twitter.com/4ioBpYmsfw
— Ashish (@Ashish2____) April 8, 2025
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఈడెన్‌గార్డెన్ వేదికగా ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో విజయం కోసం ఇరు జట్లూ హోరాహోరీగా తలపడ్డా లక్నోనే గెలుపు వరించింది. లక్నో నిర్దేశించిన 239 పరుగుల ఛేదనలో కేకేఆర్ 4 పరుగుల దూరంలో ఆగిపోయింది. పూరన్ (36 బంతుల్లో 87 నాటౌట్, 7 ఫోర్లు, 8 సిక్సర్లు), మార్ష్ (48 బంతుల్లో 81, 6 ఫోర్లు, 5 సిక్సర్లు), మార్క్మ్ (28 బంతుల్లో 47, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారంతో లక్నో.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 238 పరుగుల రికార్డు స్కోరు చేసింది. భారీ ఛేదనలో కేకేఆర్.. 20 ఓవర్లలో 234/7 వద్దే ఆగిపోయింది. కెప్టెన్ అజింక్యా రహానే (35 బంతుల్లో 61, 8 ఫోర్లు, 2 సిక్సర్లు),వెంకటేశ్ అయ్యర్ (29 బంతుల్లో 45, 6 ఫోర్లు, 1 సిక్స్)తో పాటు ఆఖర్లో రింకూ సింగ్ (15 బంతుల్లో 38 నాటౌట్, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినా ఆ జట్టుకు పరాభవం తప్పలేదు.