లక్నో: ఐపీఎల్(IPL 2025)లో లక్నో బౌలర్ దిగ్వేశ్ రాథీ, హైదరాబాద్ సన్‌రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మకు.. జరిమానా పడింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆ ఇద్దరూ వాగ్వాదాని దిగారు. అభిషేక్ ఔటైన సమయంలో .. దిగ్వేశ్ తన సిగ్నేచర్ స్టయిల్ సెండాఫ్ ఇచ్చాడు. ఆ టైంలో అభిషేక్, దిగ్వేశ్ మధ్య వాగ్వాదం జరిగింది. అంపైర్లు, ఫీల్డర్లు ఆ ఇద్దర్నీ వేరు చేశారు. అయితే దిగ్వేశ్‌పై 50 శాతం మ్యాచ్ ఫీజులో కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ తన ప్రకటనలో పేర్కొన్నది. ఆర్టికల్ 2.5 కింద ఈ సీజన్లో మూడవసారి లెవల్ 1 నేరానికి పాల్పడినట్లు ఐపీఎల్ తెలిపింది. ఇప్పటి వరకు అతను రెండు డీమెరిట్ పాయింట్లు కూడగట్టుకున్నాడు. దీంతో అతనిపై ఒక మ్యాచ్ వేటు పడినట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు. ఒక మ్యాచ్ వేటు వల్ల స్పిన్నర్ దిగ్వేశ్.. అహ్మదాబాద్‌లో మే 22వ తేదీన గుజరాత్ టైటాన్స్‌తో జరగనున్న మ్యాచ్‌కు దూరం కానున్నాడు.
ఇక సన్‌రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మకు మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని అతను ఉల్లంఘించాడు. ఆర్టికల్ 2.6 కింద అతను తొలిసారి లెవల్ 1 అఫెన్స్‌కు పాల్పడినట్లు ఐపీఎల్ తన ప్రకటనలో పేర్కొన్నది. అతని ఖాతాలోకి ఓ డీమెరిట్ పాయింట్ కూడా జతకూడింది. చేజింగ్ సమయంలో 8వ ఓవర్లో అభిషేక్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే డీప్‌లో శార్దూల్ ఆ క్యాచ్ అందుకున్నాడు. దీంతో దిగ్వేశ్ తన రెగ్యులర్ స్టయిల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ సమయంలో అభిషేక్, దిగ్వేశ్లు వాగ్వాదానికి దిగారు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అభిషేక్ కేవలం 20 బంతుల్లో 59 రన్స్ చేసి .. హైదరాబాద్ విక్టరీలో కీలక పాత్ర పోషించాడు.