లక్నో : ఐపీఎల్ తాజా సంచలనం, ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్‌లతోనే తనదైన వేగంతో పాటు వైవిధ్యమైన బౌలింగ్‌తో భావి భారత సూపర్ స్టార్‌గా ప్రశంసలు అందుకుంటున్న లక్నో పేసర్ మయాంక్ యాదవ్ సోషల్ మీడియాలో తుఫాన్ సృష్టిస్తున్నాడు. నిలకడగా 150+ వేగంతో బంతులు విసురుతున్న ఈ ఢిల్లీ కుర్రాడికి సామాజిక మాధ్యమాల్లోనూ క్రేజ్ పెరుగుతోంది. ఐపీఎల్లో అరంగేట్రం చేసిన పది రోజుల్లోనే అతడి ఫాలోవర్ల సంఖ్య మయాంక్ విసిరిన బంతుల కంటే రెట్టింపు వేగంతో దూసుకుపోతోంది.
మార్చి 30న ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చేనాటికి ఇన్‌స్టాగ్రామ్‌లో మయాంక్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య 4,570 గా ఉండగా ఏప్రిల్ 8వ తేదీకి ఆ సంఖ్య 4లక్షల48వేల (4,48,822)కు పెరిగింది. ఈ నెల 2 నుంచి 5 మధ్యలో అతడి ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 2.26 లక్షలు పెరగడం గమనార్హం. పది రోజుల వ్యవధిలో మయాంక్ పంజాబ్‌తో మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయగా బెంగళూరుతోనూ అదే ఫీట్ రిపీట్ చేశాడు.