హైదరాబాద్, ఆట ప్రతినిధి: సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నాలుగు రోజులుగా జరిగిన మహిళల ఎలైట్ బాక్సింగ్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. టోర్నీ ఆఖరి రోజైన మంగళవారం ఫైనల్ పోటీలలో రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ (ఆర్పీఎస్బీ) బాక్సర్లు సత్తా చాటారు. టోర్నీలో ఆర్పీఎస్బీ.. మూడేసి స్వర్ణాలు, రజతాలు, కాంస్యాలతో మొత్తంగా 9 పతకాలు సాధించి టీమ్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది.
స్వర్ణం ఖాయమనుకున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ రజతంతో సరిపెట్టుకుంది. 51 కిలోల విభాగంలో ఫైనల్ బరిలో నిలిచిన నిఖత్.. గాయం కారణంగా పోటీనుంచి తప్పుకోవడంతో ఆర్పీఎస్బీ బాక్సర్ జ్యోతి స్వర్ణం గెలుచుకుంది. రైల్వేస్ నుంచి 48 కిలోల విభాగంలో నీతూ, 60 కిలోల కేటగిరీలో ప్రాచీ సైతం పసిడి పతకాలతో మెరిశారు. తెలంగాణ బాక్సర్లు నిహారిక గొనెళ్ల (60 కి.), యశీ శర్మ (65 కి.) కాంస్యాలు సాధించారు. భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గొహెయిన్ (75 కి.) పసిడి గెలిచింది.