e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home స్పోర్ట్స్ కష్టాలకు పంచ్‌లిస్తూ లవ్లీనా పతక ప్రయాణం

కష్టాలకు పంచ్‌లిస్తూ లవ్లీనా పతక ప్రయాణం

చిన్ననాటి నుంచి కలలు గన్న ఒలింపిక్స్‌ ఓ వైపు.. కిడ్నీలు విఫలమై దవాఖానలో చికిత్స పొందుతున్న తల్లి మరోవైపు.. ఇదీ టోక్యోకు వెళ్లే మూడు నెలల ముందు లవ్లీనా బొర్గోహై పరిస్థితి. అలాంటి క్లిష్టమైన సందర్భంలోనూ దేశం కోసం ఆడాలన్న కసితో తీవ్రంగా శ్రమించిన లవ్లీనా.. తన తల్లితోపాటు యావత్‌ భారతం గర్వించే విజయాన్ని సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌ చేరి పతకం పక్కా చేసుకుంది. బాక్సింగ్‌లో మెడల్‌ అందుకోనున్న భారత మూడో బాక్సర్‌గా చరిత్ర సృష్టించనుంది. తాను పుట్టిన అస్సాంలోని బోరోముఖియా గ్రామాన్నిప్రపంచ పటంలో వెలుగొందేలా చేసింది.

ఈ అమ్మాయి చేతిలో గతంలో నాలుగుసార్లు ఓడిపోయా. ఈసారి ఎలాంటి బెరుకు లేకుండా పూర్తి సన్నద్ధతతో బరిలోకి దిగా. ఆ పరాజయాలకు బదులు తీర్చుకోవాలని బలంగా అనుకున్నా. ఎలాంటి ప్లాన్‌, స్ట్రాటజీ ఉపయోగించలేదు. ఎందుకంటే ఆమె ఎలా పోరాడుతుందో నాకు బాగా తెలుసు. ఒత్తిడి లేకపోవడం కలిసొచ్చింది. సెమీస్‌కు ఇంకా సమయం ఉండటంతో ప్రత్యర్థి బౌట్‌ వీడియోలను పరిశీలిస్తా.

- Advertisement -

లవ్లీనా బొర్గోహై

టోక్యో: చిన్నప్పటి నుంచి యుద్ధకళలపై మక్కువ.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు సాగిన అస్సాం యువ బాక్సర్‌ లవ్లీనా బొర్గోహై టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించింది. జీవితంలో ఎన్నో కష్టాలకు పంచ్‌లిచ్చినా.. అదే స్ఫూర్తితో విశ్వవేదికపై ప్రత్యర్థులను చిత్తుచేస్తూ సెమీస్‌ చేరింది. ఒలింపిక్స్‌ చరిత్రలో పతకం సాధించనున్న మూడో భారత బాక్సర్‌గా రికార్డు సృష్టించింది. లవ్లీనా తండ్రి అస్సాంలోని బరోముఖియా గ్రామంలో టీ తోటల్లో పని చేస్తుండేవారు. తన కవల అక్కలు లిమా, లిచా.. యుద్ధకళ యమ్‌థాయి నేర్చుకోవడం చూస్తూ పెరిగింది లవ్లీనా. ఆ తర్వాత తానూ కదనరంగంలోకి దిగింది. ఆర్థికంగా కష్టాలు ఉన్నా లవ్లీనా తండ్రి టికెన్‌ బొర్గోహై కూతుళ్లను ప్రోత్సహించారు. చిన్నతనంలోనే యమ్‌థాయిలో ప్రావీణ్యం సాధించిన లవ్లీనా జాతీయ చాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆమె చదువుతున్న సురుపతర్‌లోని పాఠశాలకు సాయ్‌ కోచ్‌ పదమ్‌ బోరో రావడం మలుపు తిప్పింది. ఆయన లవ్లీనా ప్రతిభను చూసి 2012లో గువాహటిలోని బాక్సింగ్‌ అకాడమీకి ఎంపిక చేశారు. తన గ్రామం నుంచి 300 కిలోమీటర్లు ఉన్న అకాడమీకి లవ్లీనా వెళ్లడం ఆమె జీవితాన్ని మార్చేసింది. అక్కడి నుంచి బాక్సింగ్‌లో అదరగొట్టింది. 2017 ఆసియా చాంపియన్‌షిప్‌, 2018 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కాంస్యంతో సత్తాచాటి లవ్లీనా టోక్యో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టింది. యమ్‌థాయి, కిక్‌బాక్సింగ్‌తో పాటు మణిపూర్‌ సంప్రదాయ యుద్ధకళ థాంగ్‌తాలోనూ లవ్లీనాకు మంచి ప్రావీణ్యం ఉంది.

తల్లికి శస్త్రచికిత్స జరిగినా..

తొలిసారి ఒలింపిక్స్‌కు ఎంపికై లవ్లీనా తీవ్రంగా ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో ఆమె తల్లి మొమోనీ అనారోగ్యం బారినపడింది. కిడ్నీ ఫెయిల్‌ అవడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కోల్‌కతాలో ఆమెకు శస్త్రచికిత్స చేశారు. ఆ సమయంలో జాతీయ క్యాంపును వీడిన లవ్లీనా తల్లిని చూసేందుకు వెళ్లింది. ఆమెకు సేవ చేసింది. నిద్రలేని రాత్రులు గడిపింది. ఆ తర్వాత దేశం కోసం ఆడాలన్న ఆకాంక్షతో మళ్లీ బయలుదేరింది. కరోనాతో అనారోగ్యం పాలైనా.. మెండైన ఆత్మవిశ్వాసంతో మళ్లీ పుంజుకుంది. పతకం సాధిస్తానని ఆనాడే తల్లికి మాట ఇచ్చిన లవ్లీనా.. ఆ కలను సాకారం చేసింది. కష్టాల్లో ఉన్న తన కుటుంబంలో సంబురాలు నింపింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana