సింగపూర్ : ప్రతిష్టాత్మక ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో ఫ్రాన్స్ స్టార్ స్విమ్మర్ లియోన్ మార్చండ్ మరోసారి పసిడి పతకంతో మెరిశాడు. ఆదివారం జరిగిన పురుషుల 400మీటర్ల వ్యక్తిగత మెడ్లె రేసును మార్చండ్ 4నిమిషాల 04.73సెకన్ల టైమింగ్తో స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీలో మార్చండ్కు ఇది రెండో స్వర్ణం. అంతకుముందు 200మీటర్ల మెడ్లెలోనూ పసిడి సొంతం చేసుకున్నాడు. ఇదే పోటీలో తోమోయుకి మాట్సుషితా(జపాన్), ఇలియా బోరోడిన్(రష్యా) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు.
ఇదే రేసులో భారత స్విమ్మర్ షోన్ గంగూలీ కనీసం హీట్స్ దాటలేకపోయాడు. జాతీయ రికార్డుతో టోర్నీకి అర్హత సాధించిన గంగూలీ 4 నిమిషాల 30.30 సెకన్ల టైమింగ్తో 28వ స్థానంలో నిలిచి నిరాశపరిచాడు. గత జూన్లో జరిగిన జాతీయ చాంపియన్షిప్లో స్వర్ణం గెలిచే క్రమంలో నెలకొల్పిన టైమింగ్ (4:26:64సె) కంటే ఈ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ఇదిలా ఉంటే ఈ టోర్నీలో పోటీపడ్డ భారత స్విమ్మర్లంతా కనీసం హీట్స్ దాటి ఫైనల్కు అర్హత సాధించలేకపోయారు.