బాలి: ఇండోనేషియా ఓపెన్ సూపర్ -1000 బ్యా డ్మింటన్ టోర్నీ ఆరంభం రోజే భారత షట్లర్లు లక్ష్యసేన్, పారుపల్లి కశ్యప్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ 21-23, 15-21తో కెంటా మొమోటో (జపాన్) చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్‌లో కడదాకా పోరాడినా.. ఆఖరి గేమ్‌లో లక్ష్య వెనుకబడడంతో ఓటమితో టోర్నీ నుంచి వైదొలిగాడు. పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్ కూడా నిరాశతో వెనుదిరిగాడు. 11-21, 14-21తో లోహ్ కేన్ యె (సింగపూర్)పై ఏమాత్రం పోటీనివ్వలేకపోయాడు. పురుషుల డబుల్స్‌లో అర్జున్- ధ్రువ్ కపిల ద్వయం, మిక్స్డ్ డబుల్స్‌లో వెంకట్ గౌరవ్ప్రసాద్, జుహి దేవ్‌గణ్ జోడీలు నిరాశపర్చాయి. అర్జున్, ధ్రువ్ జోడీ 20-23, 13-21తో కొరియా ద్వయం చోయి, కిమ్ వోన్హో చేతిలో పరాజయం పొందగా, వెంకట్, జుహి జంట 12-21, 4-21తో జర్మనీ జోడీ జోన్స్ రాల్ఫె, లిండా ఎఫ్లర్ చేతిలో పరాజయం పాలయ్యాయి. బుధవారం జరిగే పోరులో అయా ఒహొరి (జపాన్)తో పీవీ సింధు, పోపోవ్ (ఫ్రాన్స్)తో శ్రీకాంత్ తలడనున్నారు. ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలనే పట్టుదలతో వీరిద్దరూ ఉన్నారు.