SL vs AFG : ఆసియా కప్ చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక జూలు విదిల్చింది. అఫ్గనిస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదేసి గ్రూప్ బీ నుంచి సూపర్ 4కు దూసుకెళ్లింది. తొలి రెండు మ్యాచుల్లో అతికష్టమ్మీద గట్టెక్కిన ఆ జట్టు అఫ్గన్‌పై మాత్రం చెలరేగిపోయింది. భారీ ఛేదనలో ఆదిలోనే కీలక వికెట్లు పడినా.. కుశాల్ మెండిస్(74 నాటౌట్), కమిందు మెండిస్(26 నాటౌట్) అఫ్గన్ బౌలర్ల ఎత్తులను చిత్తు చేశారు. కాస్త కుదురుకున్నాక గేర్ మార్చిన కుశాల్ 17 వ ఓవర్లో సిక్స్, ఫోర్ బాది 17 రన్స్ పిండుకున్నాడు. ముజీబ్ ఓవర్లో కుశాల్ వరుసగా రెండు ఫోర్లతో లంక 6 వికెట్ల తేఆతో గెలుపొందింది.
చావోరేవో పోరులో అఫ్గనిస్థాన్ పోరాడి ఓడింది. మాజీ ఛాంపియన్ శ్రీలంకపై భారీ స్కోర్ చేసిన కాబూలీ టీమ్.. బౌలర్ల వైఫల్యంతో లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఓపెనర్ పథుమ్ నిశాంక(6)ను అజ్మతుల్లా ఔట్ చేసి బ్రేకిచ్చాడు. ఆ తర్వాత నబీ ఓవర్లో కమిల్ మిశారా సైతం వెనుదిరిగాడ. ఆ దశలో కుశాల్ పెరీరా(28), కుశాల్ మెండిస్(74నాటౌట్) కీలక భాగస్వామ్యంతో లంకను నిలబెట్టారు. పెరీరా తర్వాత చరిత్ అలసంక (17) ఇలా వచ్చి అలా వెళ్లాడు. దాంతో.. అఫ్గన్ జట్టు పోటీలోకి వచ్చింది. కానీ, కమింద్ మెండిస్ (26 నాటౌట్)జతగా కుశాల్ రెచ్చిపోయాడు. నూర్ అహ్మద్ వేసిన 17 వ ఓవర్లో సిక్స్, ఫోర్ బాది 17 రన్స్ పిండుకున్నాడు. అనంతరం కమింద్ సిక్సర్.. ముజీవ్ ఓవర్లో కుశాల్ రెండు బౌండరీలతో లంకను సూపర్ 4కు చేర్చాడు. బౌలింగ్ యూనిట్ వైఫల్యంతో అఫ్గన్ జట్టు ఇంటిదారి పట్టగా.. బంగ్లాదేశ్ సూపర్ 4కు దూసుకెళ్లింది.
Done 🇱🇰✅ pic.twitter.com/KQlzbaPszW
— ESPNcricinfo (@ESPNcricinfo) September 18, 2025
టాస్ గెలిచిన అఫ్గనిస్థాన్ ఆదిలో తడబడినా ఆఖర్లో భారీ స్కోర్ చేసింది. శ్రీలంక బౌలర్లను కాచుకోలేక టాపార్డర్ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. పవర్ ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయిన కాబూలీ టీమ్ మొహమ్మద్ నబీ(60) ఇబ్రహీ జద్రాన్(24) ఇన్నింగ్స్‌తో కోలుకుంది. వంద లోపే కుప్పకూలేలా కనిపించిన జట్టుకు కెప్టెన్ రషీద్ ఖాన్ (24) అండతో నబీ కొండంత స్కోర్ అందించాడు. తనదైన పవర్ హిట్టింగ్తో రెచ్చిపోయిన రషీద్ ఔటయ్యాక.. గేర్ మార్చిన నబీ 20వ ఓవర్లో చెలరేగిపోయాడు. వెల్లలాగేకు చుక్కలు చూపిస్తూ వరుసగా 5 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో.. అఫ్గన్ జట్టు లంకకు కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించింది.