కొలంబో: భారత సీనియర్ స్పిన్నర్, చైనామన్ కుల్దీప్ యాదవ్ టెస్టు కెరీర్‌కు ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. శ్రీలంకతో తొలి టెస్టులో పూర్తిగా విఫలమైన అతడిని పక్కానబెట్టాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. ఆదివారం నుంచి కొలంబోలో జరిగే రెండో టెస్టులో అతని స్థానంలో యువ స్పిన్నర్ సారాంశ్ జైన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని చూస్తోంది. గాలె మైదానంలో ఐదో రోజు పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంలా మారిన వేళ.. తన మణికట్టు మాయాజాలంతో కుల్దీప్ ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తాడని చేస్తాడని అంతా భావించారు.
కానీ రెండో ఇన్నింగ్స్‌లో అతను 11 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయకుండా 38 పరుగులు ఇచ్చి తీవ్రంగా నిరాశపరిచాడు. టీమ్ మేనేజ్మెంట్ కూడా జడేజా, మానవ్ సుతార్లపైనే ఎక్కువ నమ్మకం ఉంచగా, ఆ ఇద్దరూ కలిసి 14 వికెట్లతో భారత్ ఘనవిజయానికి బాటలు పరిచారు. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో కుల్దీప్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. గాలె టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 31 ఏండ్ల కుల్దీప్ సాధించింది కేవలం ఒక్క వికెట్ మాత్రమే. అది కూడా తొలి ఇన్నింగ్స్‌లో కమిందు మెండిస్ ఇచ్చిన క్యాచ్‌ను శుభ్‌మన్ గిల్ అద్భుతంగా పట్టుకోవడంతో దక్కింది.
పిచ్ నుంచి గ్రిప్, బౌన్స్ రాబట్టేందుకు కుల్దీప్ రౌండ్ ది వికెట్ నుంచి బౌలింగ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఎల్బీ అవకాశాలను రాబట్టలేకపోయాడు. ఇక, శ్రీలంక టాపార్డర్‌లో ఎక్కువ మంది లెఫ్టాండ్ బ్యాటర్లు ఉన్నారు. వాళ్లను కట్టడి చేయడానికి ఆఫ్ స్పిన్నర్ సరైన ఆయుధం కాబట్టి, కుల్దీప్ స్థానంలో ఆఫ్‌స్పిన్నర్ సారాంశ్ జైన్‌ను బరిలోకి దించాలని టీమ్ మేనేజ్మెంట్ యోచిస్తోంది. సారాంశ్ జట్టులోకి వస్తే లంక బ్యాటింగ్ ఆర్డర్‌పై ఒత్తిడి పెంచవచ్చని భావిస్తోంది. ఆడిన తొలి రెండు టెస్టుల్లోనే మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శన చేయగా.. ఇప్పుడు కొలంబో టెస్టులో కొత్త ఆటగాడు సారాంశ్‌ను తుది జట్టులోకి తీసుకుంటే అది కుల్దీప్ టెస్ట్ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపే చాన్సుంది.