రాణించిన ప్రసిద్ధ్, మోర్గాన్
5 వికెట్ల తేడాతో పంజాబ్ ఓటమి
వరుస పరాజయాలతో సతమతమవుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ పదిహేను రోజుల తర్వాత గెలుపు రుచి చూసింది. మొతెరాలో మోత ఖాయం అనుకుంటే చెన్నైలాంటి స్లో పిచ్ ఎదురవడంతో ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడగా.. పంజాబ్ నిర్దేశించిన స్వల్ప
లక్ష్య ఛేదనలో మోర్గాన్, త్రిపాఠి సత్తాచాటడంతో నైట్ రైడర్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి పైకి ఎగబాకింది!
అహ్మదాబాద్: పరుగులు సాధించడం కష్టతరమైన పిచ్‌పై బౌలింగ్‌లో రాణించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ 14వ సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన నరేంద్ర మోదీ మైదానంలో సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన పోరులో కోల్‌కతా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (31) టాప్ స్కోరర్. కోల్‌కతా బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, కమిన్స్, నరైన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా 16.4 ఓవర్లలో 5 వికెట్లకు 126 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఇయాన్ మోర్గాన్ (47 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రాహుల్ త్రిపాఠి (41; 7 ఫోర్లు) రాణించారు.
కెప్టెన్ ఇన్నింగ్స్
మందకొడి పిచ్‌పై టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (19), మయాంక్ అగర్వాల్ ఆచితూచి ఆడటంతో 5 ఓవర్లు ముగిసే సరికి 29/0తో నిలిచింది. ఆరో ఓవర్లో చక్కటి సిక్సర్ కొట్టిన రాహుల్ మరుసటి బంతికే ఔట్ కాగా.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (0), దీపక్ హుడా (1) నిరాశ పరిచారు. కుదురుగా ఆడుతున్న మయాంక్‌ను నరైన్ ఔట్ చేయగా.. పూరన్ (19), షారుక్ ఖాన్ (13) కాసేపు పోరాడారు. చివర్లో జోర్డాన్ (18 బంతుల్లో 30; ఒక ఫోర్, 3 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో పంజాబ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది.
బౌలర్ల హవా..
ఛేదనలో కోల్‌కతాకు శుభారంభం దక్కలేదు. తొలి మూడు ఓవర్లలో ఆ జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. నితీశ్ రాణా (0), శుభ్‌మన్ గిల్ (9), నరైన్ (0) పెవిలియన్‌కు వరుస కట్టారు. దీంతో కోల్‌కతా 17/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో త్రిపాఠితో కలిసి కెప్టెన్ మోర్గాన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. బంతి ఆగి వస్తున్న వికెట్‌పై బ్యాటింగ్ కష్టసాధ్యమైనా.. ఈ జోడీ వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలు రాబ్టటింది. దీంతో 10 ఓవర్లకు నైట్‌రైడర్స్ 76/3తో నిలిచింది. నాలుగో వికెట్‌కు 66 పరుగులు జోడించాక త్రిపాఠి ఔటైనా.. రస్సెల్ (10), కార్తీక్ (12 నాటౌట్) అండతో మోర్గాన్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. పంజాబ్ బౌలర్లలో షమీ, హుడా, అర్శ్‌దీప్, హెన్రిక్స్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
‘పీఎం కేర్స్’కు కమిన్స్ విరాళం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ ‘పీఎం కేర్స్’నిధికి ఆర్థిక సాయం ప్రకటించాడు. ప్రాణవాయు సంబంధిత సామగ్రి కొనుగోలుకు రూ. 37 లక్షల (50 వేల డాలర్లు) విరాళం ఇస్తున్నట్లు సోమవారం పేర్కొన్నాడు. ‘సహచర ఐపీఎల్ ఆటగాళ్లతో పాటు, ప్రపంచంలోని క్రీడాకారులందరూ సాయం అందించండి. నా వంతుగా రూ. 37.36 లక్షలు ఇస్తున్నా’అని ట్వీట్ చేశాడు.
స్కోరు బోర్డు
పంజాబ్: రాహుల్ (సి) నరైన్ (బి) కమిన్స్ 19, మయాంక్ (సి) త్రిపాఠి (బి) నరైన్ 31, గేల్ (సి) కార్తీక్ (బి) మావి 0, హుడా (సి) మోర్గాన్ (బి) కృష్ణ 1, పూరన్ (బి) వరుణ్ 19, హెన్రిక్స్ (బి) నరైన్ 2, షారుక్ (సి) మోర్గాన్ (బి) కృష్ణ 13, జోర్డాన్ (బి) కృష్ణ 30, రవి (సి) మోర్గాన్ (బి) కమిన్స్ 1, షమీ (నాటౌట్) 1, అర్శ్‌దీప్ (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 123/9. వికెట్ల పతనం: 1-36, 2-38, 3-42, 4-60, 5-75, 6-79, 7-95, 8-98, 9-121, బౌలింగ్: 4-0-13-1, కమిన్స్ 3-0-31-2, నరైన్ 4-0-22-2, కృష్ణ 4-0-30-3, రస్సెల్ 1-0-2-0, వరుణ్ 4-0-24-1.
కోల్‌కతా: గిల్ (ఎల్బీ) షమీ 9, రాణా (సి) షారుక్ (బి) హెన్రిక్స్ 0, త్రిపాఠి (సి) షారుక్ (బి) హుడా 41, నరైన్ (సి) రవి (బి) అర్శ్‌దీప్ 0, మోర్గాన్ (నాటౌట్) 47, రస్సెల్ (రనౌట్) 10, కార్తీక్ (నాటౌట్) 12, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 16.4 ఓవర్లలో 126/5. వికెట్ల పతనం: 1-5, 2-9, 3-17, 4-83, 5-98, బౌలింగ్: హెన్రిక్స్ 1-0-5-1, షమీ 4-0-25-1, అర్శ్‌దీప్ 2.4-0-27-1, రవి 4-0-19-0, జోర్డాన్ 3-0-24-0, హుడా 2-0-20-1.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ నె,ర పా
చెన్నై 5 4 1 1.61 8
ఢిల్లీ 5 4 1 0.33 8
బెంగళూరు 5 4 1 0.09 8
ముంబై 5 2 3 -0.03 4
కోల్‌కతా 6 2 4 -0.30 4
పంజాబ్ 6 2 4 -0.60 4
రాజస్థాన్ 5 2 3 -0.68 4
హైదరాబాద్ 5 1 4 -0.18 2
ఆ-ఆడినవి, గె-గెలుపు, ఓ-ఓటమి, నె.ర-నెట్ రన్‌రేట్, పా-పాయింట్లు