చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో తమ తొలి మ్యాచ్‌లోనే కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పోరులో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. యువ ఆటగాళ్లు నితీశ్ రాణా(80:56 బంతుల్లో 9ఫోర్లు, 4సిక్సర్లు), రాహుల్ త్రిపాఠి(53: 29 బంతుల్లో 5ఫోర్లు,2సిక్సర్లు) అద్భుత అర్ధశతకాలతో రాణించడంతో కోల్‌కతా భారీ స్కోరు సాధించింది. రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్(2/24), మహ్మద్ నబీ(2/32) మాత్రమే కోల్‌కతాను కట్టడి చేశారు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్(1/45), సందీప్ శర్మ(0/35) ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు రాణా, శుభ్‌మన్ గిల్(15) మెరుపు ఆరంభాన్ని అందించారు. సందీప్ శర్మ వేసిన నాలుగో ఓవర్లో రాణా హ్యాట్రిక్ ఫోర్లతో చెలరేగాడు. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడుతూ వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టారు. 6 ఓవర్లకు 50/0తో మెరుగైన స్థితిలో నిలిచింది. హాఫ్‌సెంచరీ పూర్తైన తర్వాత రాణా గేర్ మార్చాడు. గిల్ ఔటైనా రాణా జోరు తగ్గించలేదు. త్రిపాఠితో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
భువనేశ్వర్ కుమార్ వేసిన 15వ ఓవర్లో రాణా 4, త్రిపాఠి 6,4,4 బాదడంతో 19 పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి ఫోర్ కొట్టిన త్రిపాఠి కేవలం 28 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మహ్మద్ నబీ 18వ ఓవర్లో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. వరుస బంతుల్లో క్రీజులో పాతుకుపోయిన రాణాతో పాటు అప్పుడే క్రీజులోకి వచ్చిన మోర్గాన్‌ను పెవిలియన్ పంపి స్కోరు వేగానికి అడ్డుకట్ట వేశాడు. చివర్లో దినేశ్ కార్తీక్(22 నాటౌట్: 9 బంతుల్లో 2ఫోర్లు,సిక్స్) తనదైన స్టైల్లో రెచ్చిపోయి జట్టు స్కోరును 180 దాటించాడు.
Two wickets in two balls for Mohammad Nabi.
— IndianPremierLeague (@IPL) April 11, 2021
Nitish Rana and Eoin Morgan depart.
Live – https://t.co/jt3qCUsiQa #SRHvKKR #VIVOIPL pic.twitter.com/YRmVIXOejg