టీ20 కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతూ కోహ్లీ పంపిన రాజీనామా లేఖలో ఒక వాక్యమే బీసీసీఐ వర్సెస్ కోహ్లీ గొడవకు కారణం అయ్యుండొచ్చని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. సోషల్ మీడియాలో కోహ్లీ స్టేట్మెంట్ దొరకడంతో దాన్ని తాను చదివానని గవాస్కర్ చెప్పాడు.
ఈ రాజీనామాలో కోహ్లీ ఒక మాట అన్నాడని, ఆ వాక్యం బీసీసీఐలో అధికారంలో ఉన్న వారికి రుచించకపోయి ఉండొచ్చని వివరించాడు. ఈ లేఖలో కోహ్లీ.. టెస్టు, వన్డేల్లో భారత జట్టుకు సారధ్యం కొనసాగిస్తాను అని చెప్పాడు. దీన్ని టెస్టులు, వన్డేల్లో భారత జట్టుకు నాయకత్వం వహించడానికి అందుబాటులో ఉంటాను అని మార్చాల్సింది అని సన్నీ తెలిపాడు.
‘ఈ రెండు ఫార్మాట్లలో తానే కెప్టెన్గా ఉంటానని అనుకోవడం వల్లే అతనిపై ఈ యాంటీ భావనకు కారణం అయ్యుండొచ్చు. అతను ఐసీసీ ఈవెంట్లు గెలవకపోవడం నిజమే. కానీ అది పక్కనపెడితే స్వదేశంలో అయినా, విదేశాల్లో అయినా ప్రపంచంలో అన్నిచోట్లా జట్టుకు విజయాలందించాడు. అలాంటి వ్యక్తి నాయకత్వంపై అసంతృప్తి అక్కర్లేదు’ అని గవాస్కర్ విశ్లేషించాడు.