భారత స్టార్ ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ ఒకడు. ఒకప్పుడు నిలకడలేమితో బాధ పడిన రాహుల్.. ఆ తర్వాత వరుసగా భారీ ఇన్నింగ్సులు ఆడుతూ సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్లో దాదాపు ప్రతి సీజన్లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు.
అభిమానలతో కూడా అంతే చనువుగా ఉండే రాహుల్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. తాజాగా ఐపీఎల్ ప్రారంభమైన తరుణంలో జట్లన్నీ తమ అభిమానులకు దగ్గరవడానికి చూస్తున్నాయి. ఈ క్రమంలోనే ‘‘బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్’’ అనే ప్రోగ్రాంలో రాహుల్ పాల్గొన్నాడు. ఇక్కడే తన పేరు వెనుక ఉన్న వింత కథ చెప్పాడు.
ఇదే ప్రశ్న ఈ స్టార్ ఓపెనర్‌ను కూడా చాలాసార్లు వేధించిందట. అయితే తనకు అమ్మే పేరు పెట్టిందని తెలిసి ఆమెను అడిగాడట. రాహుల్ వాళ్ల అమ్మ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు పెద్ద ఫ్యాన్. 1990లలో షారుఖ్ చేసిన చాలా చిత్రాల్లో అతని పేరు రాహులే. అందుకే ఆ పేరు పెట్టినట్లు ఆమె చెప్పడంతో రాహుల్ కూడా నమ్మేశాడట. తనను ఎవరు అడిగినా ఇదే కథ చెప్పేవాడట.
అలాగే ఒక స్నేహితుడికి కూడా తన పేరు వెనుక ఉన్న కథ చెప్పాడట రాహుల్. అయితే ఆ ఫ్రెండ్‌కి బాలీవుడ్ గురించి చాలా విషయాలు తెలుసు. అతను వెంటనే రాహుల్ కథలో ఉన్న తప్పును గుర్తించేశాడు. ‘‘బ్రో… షారుఖ్ ఖాన్ ఫస్ట్ టైం రాహుల్ కేరక్టర్ వేసింది 1994లో.. నువ్వు పుట్టింది 1992లో.. ఆ పేరు నీకెలా పెడతారు?’’ అని అడిగాడట. దీంతో షాకైన రాహుల్ ఇంటికెళ్లి అసలు విషయం చెప్పాలని తల్లిదండ్రులను డిమాండ్ చేశాడు.
అప్పుడు రాహుల్ తండ్రి అసలు విషయం చెప్పాడు. రాహుల్ తండ్రికి సునీల్ గవాస్కర్ అంటే విపరీతమైన అభిమానం. అప్పట్లో రేడియోలో వార్తలు వింటుంటే.. గవాస్కర్ కుమారుడికి రోహన్ అని పేరు పెట్టినట్లు తెలిసింది. ఆ రోహన్ పేరు రేడియోలో సరిగా వినపడక ‘‘రాహుల్’’ అనుకున్నాడట మన రాహుల్ తండ్రి. అంతే తన కుమారుడికి కూడా అదే పేరు పెట్టేశాడు. ఈ విషయాన్ని చెప్పిన రాహుల్.. ‘‘నా జీవితంలో 26-27 ఏళ్లు మా అమ్మ చెప్పిన అబద్ధమే నమ్మేశాను’’ అంటూ నవ్వేశాడు.