అడిలైడ్: ఆస్ట్రేలియాతో అడిలైడ్ టెస్టు కోసం భారత్ అన్ని అస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నది. పెర్త్ టెస్టు విజయంతో మంచి ఊపుమీదున్న టీమ్ఇండియా గులాబీ బంతితో శుక్రవారం నుంచి మొదలయ్యే డే అండ్ నైట్ టెస్టు కోసం చెమటోడుస్తున్నది. గులాబీ బంతితో నెట్స్‌లో గంటల కొద్ది ప్రాక్టీస్ చేస్తూ కంగారూల గట్టి కౌంటర్ ఇచ్చేందుకు పావులు కదుపుతున్నది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్‌శర్మ రాకతో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తొలి టెస్టులో అదరగొట్టిన యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్‌ను కొనసాగిస్తారా లేక రోహిత్‌ను ఓపెనింగ్‌కు పంపిస్తారా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ ‘జట్టులో ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. తుది జట్టులో చోటు కాపాడుకోవడమే నా లక్ష్యం. టీమ్ మేనేజ్మెంట్ ఏ స్థానంలో పంపినా ఆడుతాను. ఇప్పటికే టాపార్డర్, మిడిలార్డర్లో ఆడటం ద్వారా అనుభవం సంపాదించాను. గతంలో ఎలా ఆడాలనే దానిపై ఒకింత ఇబ్బంది పడ్డాను. కానీ వన్డేల్లో, టెస్టుల్లో వేర్వేరు స్థానాల్లో బరిలోకి దిగడం ద్వారా రాటుదేలాను’ అని అన్నాడు.
బీజీటీ సిరీస్‌లో భారత నెట్ ప్రాక్టీస్ సెషన్లకు అభిమానులను అనుమతించకూడదని నిర్ణయానికి వచ్చారు. ఆసీస్‌తో రెండో టెస్టు కోసం మంగళవారం ఓపెన్ నెట్ ప్రాక్టీస్ సెషన్స్‌కు ఫ్యాన్స్‌ను అనుమతించారు. టీమ్ఇండియా క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వందల సంఖ్యలో అభిమానులు వచ్చారు. నెట్స్ వద్ద ఫ్యాన్స్ అరుపులు, కేకలతో ప్లేయర్లు ఇబ్బంది పడ్డారు. దీంతో ఇప్పటి నుంచి ఎవరిని అనుమతించవద్దని నిర్ణయం తీసుకున్నారు.