గుజరాత్ టైటన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు తీరని కష్టాల్లో మునిగిపోయింది. ఓపెనర్లు సునీల్ నరైన్ (5), శామ్ బిల్లింగ్స్ (4) ఇద్దరూ విఫలమవడంతో.. ఆ తర్వాత వచ్చిన నితీష్ రాణా (2), శ్రేయాస్ అయ్యర్‌లపై భారం పడింది. ఈ ఒత్తిడిని తట్టుకొని ఆడేందుకు ఇద్దరూ ప్రయత్నించారు కానీ.. రాణా క్రీజులో కుదురుకోలేకపోయాడు. ఐదో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన ఫెర్గూసన్.. రెండో బంతికే రాణాను అవుట్ చేశాడు. ఫెర్గూసన్ వేసిన బంతిని ఆఫ్‌సైడ్ పుష్ చేసేందుకు రాణా ప్రయత్నించాడు.
అయితే టైమింగ్ కుదరకపోవడంతో బంతి వెనక్కు వెళ్లి కీపర్ చేతుల్లో పడింది. ఫెర్గూసన్ ఒక్కడే అప్పీల్ చేయడంతో అంపైర్ స్పందించలేదు. అయితే కెప్టెన్ హార్దిక్‌తో మాట్లాడిన ఫెర్గూసన్ రివ్యూ తీసుకునేలా చేశాడు. రివ్యూలో బంతి.. రాణా బ్యాట్‌ను తాకినట్లు తేలడంతో అతను పెవిలియన్ చేరాడు. దీంతో 16 పరుగులకే కోల్‌కతా జట్టు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం క్రీజులో శ్రేయాస్, రింకు సింగ్ ఉన్నారు.