లండన్ : ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ 12 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ తన జాతీయ జట్టులో భాగం కానున్నాడు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు అతను స్పెషలిస్ట్ మెంటార్‌గా నియమితుడయ్యాడు. త్వరలోనే తను బ్రెండన్ మెక్కల్లమ్ నేతృత్వంలోని కోచింగ్ టీమ్‌తో చేరుతాడని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఒక ప్రకటనలో వెల్లడించింది.
వచ్చే ఏడాది సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమివ్వబోయే వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లిష్ జట్టును విజయపథంలో నడిపేందుకు గాను పీటర్సన్‌ను నియమించినట్టు ఈసీబీ తెలిపింది. చిన్నప్పుడు సౌతాఫ్రికాలోనే పెరిగిన పీటర్సన్ అనుభవం ఇంగ్లండ్ జట్టుకు ఉపయోగపడుతుందని బోర్డు భావిస్తోంది.