కాటారం, డిసెంబర్ 11: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలానికి చెందిన క్రికెటర్ ప్లేయర్ శ్లోక ఫాల్గుణరెడ్డి ప్రతిభకు గుర్తింపు లభించింది. నిలకడగా రాణిస్తున్న ఫాల్గుణరెడ్డి ఈనెల 13 నుంచి లక్నోలో మొదలయ్యే బీసీసీఐ అండర్-19 టోర్నీలో పోటీపడే హైదరాబాద్ టీమ్‌కు ఎంపికైంది. ఇటీవల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ప్రకటించిన జట్టులో ఫాల్గుణరెడ్డి చోటు దక్కించుకుంది.
కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన బొమ్మన జైపాల్‌రెడ్డి, రాజేశ్వరి దంపతుల కుమార్తె ఫాల్గుణరెడ్డి ఇటు క్రికెట్‌తో పాటు కళలు, వ్యక్తిత్వ అభివృద్ధి ఇలా విభిన్న రంగాల్లో ప్రతిభ చాటుతున్నది. ఇటీవల లక్నోలో జరిగిన జాతీయ అండర్-14 మహిళల క్రికెట్ టోర్నీ ఫైనల్లో మహారాష్ట్రపై కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకమైంది. ఆమె మెరుగైన ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటూ హెచ్‌సీఏ సెలెక్షన్ కమిటీ జట్టులో చోటు కల్పించింది.