Kapil Dev | టీమిండియా దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ హెడ్‌కోచ్ పాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధునిక క్రికెట్లో హెడ్‌కోచ్ పాత్ర ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడం కంటే వారిని మేనేజ్ చేయడమే ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రస్తుత భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పనితీరు శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఐసీసీ శతాబ్ది కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ రోజుల్లో కోచ్ అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని.. గౌతమ్ గంభీర్ కోచ్ కాలేడని.. అతను కేవలం మేనేజర్‌గా ఉండగలడన్నారు.
పాఠశాలలు, కళాశాలల్లో బోధించే వారు మాత్రమే కోచ్‌లని పేర్కొన్నారు. ఒక లెగ్ స్పిన్నర్, వికెట్ కీపర్ ఆ విభాగంలో ఇప్పటికే నిష్ణాతులైనప్పుడు మీరు వారికి ఎలా శిక్షణ ఇస్తారు? అలాంటి పరిస్థితిలో అత్యంత ముఖ్యమైంది వర్క్ మేనేజ్మెంట్. ఒక మేనేజర్ ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసం ఇచ్చి ప్రోత్సహిస్తాడని.. ఇంకా బాగా రాణించగలరన్న భావనను కలిగిస్తాడని పేర్కొన్నారు. కెప్టెన్, మేనేజర్ పాత్రపై స్పందిస్తూ ఆటగాళ్లు మానసికంగా సౌకర్యవంతంగా ఉండేలా చేయడం చాలా ముఖ్యమని కపిల్ దేవ్ తెలిపారు. జట్టుకు, ముఖ్యంగా సరిగ్గా రాణించని ఆటగాళ్లకు సౌకర్యం, ఆత్మవిశ్వాసం ఇవ్వడమే కెప్టెన్, మేనేజర్ పని అని తెలిపారు. తన కెప్టెన్సీ అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. శతకం సాధించిన ఆటగాడితో తాను విందుకు వెళ్లనని.. ఇబ్బందులుపడుతున్న వారితో సమయంతో గడపడానికి తాను ఇష్టపడేవాడినని, తద్వారా వారికి ఆత్మవిశ్వాసం లభిస్తుందన్నారు.
సునీల్ గవాస్కర్ ఈ రోజుల్లో ఆడి ఉంటే.. టీ20 క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా ఉండేవాడని కపిల్ పేర్కొన్నారు. పటిష్టమైన డిఫెన్స్ ఉన్న ఆటగాళ్లు దాడి చేయడం సులభం అని భావిస్తారని.. కానీ, డిఫెన్స్ చేయడమే అత్యంత కష్టమైన విషయమన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న వుమెన్స్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మాట్లాడుతూ సొంత గడ్డంపై టీమిండియా వుమెన్స్ జట్టు ప్రపంచకప్ సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. ట్రోఫీపై భారత్ అని రాసి ఉండటాన్ని చూడడం భావోద్వేగ క్షణమని.. గతంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ పేర్లే కనిపించేవని.. సొంతగడ్డపై తొలిసారి కప్ గెలవడం గొప్ప విజయమన్నారు. ప్రేక్షకుల కేరింతల ప్రతిధ్వనించినప్పుడే భారతదేశం నిజంగా ఛాంపియన్‌గా మారిందని తాను గ్రహించానని మిథాలీ చెప్పుకొచ్చారు.