Hardik Pandya: తొలి ప్రయత్నంలోనే గుజరాత్ టైటాన్స్‌కు ట్రోఫీ అందించిన హార్ధిక్ పాండ్యా వచ్చే సీజన్ నుంచి ఆ జట్టుతో ఆడేది అనుమానంగానే ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ యాజమాన్యంతో విభేదాల కారణంగా హార్ధిక్ ఆ ఫ్రాంచైజీని వీడనున్నాడని, ఇప్పటికే అతడితో ముంబై ఇండియన్స్ చర్చలు జరుపుతోందనీ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి 2024 సీజన్లో గుజరాత్‌ను నడిపించేందెవరు..? ఆ జట్టులో కెప్టెన్సీ మెటిరీయల్ ఉన్న ఆటగాళ్లు ఎంతమంది ఉన్నారు..?
ఆప్షన్స్ పుష్కలం..
పాండ్యా నిష్క్రమణ (?) నేపథ్యంలో గుజరాత్ కెప్టెన్సీ కోసం ముగ్గురి మధ్య పోటీ నెలకొంది. కివీస్ సారథి కేన్ విలియమ్సన్తో పాటు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్లు కెప్టెన్సీ పోస్ట్‌కు పోటీపడుతుండగా అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా బరిలో ఉన్నాడు. వీళ్లే గాక ఈ ఏడాది సౌతాఫ్రికాలో ముగిసిన ఎస్ఎ20లో డేవిడ్ మిల్లర్‌కు కూడా సారథిగా పనిచేసిన అనుభవం ఉంది.
అనుభవమా..? యువ మంత్రమా..?
హార్ధిక్ స్థానాన్ని సీనియర్ సారథితో భర్తీ చేయాలనుకుంటే గుజరాత్‌కు కేన్ మామ బెటర్ ఆప్షన్. అంతర్జాతీయ క్రికెట్లో అతడు ఇప్పటికే ప్రూవ్డ్ కెప్టెన్. కొత్తగా అతడు నిరూపించుకోవాల్సింది కూడా ఏదీ లేదు. 2019లో వరల్డ్ కప్ ఫైనల్, 2023లో సెమీస్‌తో పాటు 2021లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్, 2022లో కివీస్‌ను సెమీస్ చేర్చిన అతడు.. 2021లో తన దేశానికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా అందించాడు. ఐపీఎల్లో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్‌కు సారథిగా పనిచేసిన అనుభవమూ కేన్ మామకు ఉంది.
ఒకవేళ విలియమ్సన్ కాకుంటే భవిష్యత్ కోణంలో చూస్తే శుభ్‌మన్ గిల్ కూడా రేసులో ఉన్నాడు. ఈ యువ ఓపెనర్ ఇదివరకే ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్లో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. గత రెండు ఐపీఎల్ సీజన్లతో పాటు గడిచిన ఏడాదిన్నర కాలంగా పరుగుల వరద పారిస్తున్నాడు. టీమిండియాకు భావి సారథి రేసులో అతడు లేకపోలేదు. ఇదివరకు కెప్టెన్సీ అనుభవం లేకపోయినా అతడిలో కెప్టెన్సీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతుండగానే ఆ జట్టు వ్యవహారాలు చూసుకునే విక్రమ్ సోలంకి కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక రషీద్ ఖాన్ ఇదివరకే గుజరాత్ టీమ్‌కు వైస్ కెప్టెన్. గత సీజన్లో పాండ్యా లేనప్పుడు అతడు సారథ్య బాధ్యతలు కూడా మోశాడు. ఎస్ఎ20లో కూడా ముంబై టీమ్‌కు సారథిగా పనిచేసిన అనుభవం ఉంది. మరి ఈ ముక్కోణపు పోరులో గుజరాత్ కెప్టెన్సీ ఎవరిని వరించనుందని త్వరలోనే తేలనుంది.