న్యూఢిల్లీ: ఏఎఫ్సీ ఏషియన్ కప్ క్వాలిఫయర్స్‌లో హాంకాంగ్ చేతిలో భారత ఓటమి తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. తమ(127) కంటే తక్కువ ర్యాంక్‌లో ఉన్న హాంకాంగ్(153) చేతిలో టీమ్ఇండియా ఓడిపోవడాన్ని అటు అభిమానులతో పాటు మాజీలూ తప్పుబడుతున్నారు. భారత్ ఫుట్‌బాల్‌ను అధ్యక్షుడు కల్యాణ్ చౌబే పూర్తిగా నాశనం చేశాడని మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.
హాంకాంగ్ ఫలితాన్ని ఉద్దేశించి మాట్లాడిన దిగ్గజ భూటియా..పాలకవర్గ సభ్యులు ఇగోలను పక్కకు పెట్టి పనిచేయాలని సూచించాడు. ‘గతంలో మనం తరుచూ ఆడిన ఏషియన్ టోర్నీకి కనీసం అర్హత సాధించకపోవడం చాలా బాధగా ఉంది
. ఉబ్బెకిస్థాన్, ఇండోనేషియా, జోర్డాన్ లాంటి దేశాలు ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధిస్తున్నాయి. కానీ మనం ఆసియా కప్ దగ్గరే ఆగిపోవడం దురదృష్టకరం. అధ్యక్షుడు కల్యాణ్ చౌబే భారత ఫుట్‌బాల్‌ను నాశనం చేశాడు. ఇందుకు బాధ్యత వహిస్తూ అతను రాజీనామా చేయాలి. ముగ్గురు ప్రధాన కార్యదర్శులు రెండున్నరేండ్ల నుంచి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు’ అని భూటియా విమర్శలు గుప్పించాడు.