హైదరాబాద్, ఆట ప్రతినిధి: వీబీఆర్ డెవలపర్స్ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించనున్న ‘స్టార్ మహిళా కబడ్డీ హల్చల్’ లోగోను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. సోమవారం హైదరాబాద్లోని తన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడ కబడ్డీని ప్రోత్సహించాలనే సంకల్పంతో జీహెచ్ఎంసీ మహిళా కార్పొరేటర్లు, ప్రము ఖ టీవీ మహిళా ఆర్టిస్టులు, జానపద కళాకారిణులతో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ విజయవంతం కావాలని శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ క్రీడల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లో రియల్ స్టేజి ఆర్టిస్టు సంఘం అధ్యక్షుడు విక్రమాదిత్య రెడ్డి, నవీన, రవి, విజయలక్ష్మీ, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.