చండీఘడ్: హర్యానా క్రీడా మంత్రి సందీప్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆ రాష్ట్రానికి చెందిన జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ ఆరోపణలు చేశారు. శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి ఆ అథ్లెట్ ఈ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల్ని క్రీడా మంత్రి సందీప్ ఖండించారు. కావాలంటే వ్యక్తిగత విచారణ చేపట్టాలని ఆయన కోరారు. క్రీడా మంత్రి గురించి ఫిర్యాదు చేసేందుకు ఆ కోచ్ హర్యానా సీఎం అపాయింట్మెంట్ కూడా కోరింది.
తొలిసారి మంత్రి తనను ఓ జిమ్ వద్ద చూశాడని, ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో తనకు మంత్రి మెసేజ్ చేసినట్లు ఆ మహిళా కోచ్ ఆరోపించింది. పదే పదే కలవాలని వత్తిడి తెచ్చాడని ఆరోపించింది. నేషనల్ గేమ్స్ సర్టిఫికేట్ పెండింగ్లో ఉన్నదని, అందుకే కలవాలనుకుంటున్నట్లు మంత్రి మెసేజ్ చేసినట్లు ఆమె తెలిపారు. సర్టిఫికేట్లతో మంత్రి ఇంటికి వెళ్తే.. ఆయన తనతో లైంగికంగా వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించింది.