హనుమకొండ చౌరస్తా, మే 28: బెంగళూరు వేదికగా జరిగిన 8వ ఇండియన్ ఓపెన్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్లు సత్తాచాటారు. గురువారం జరిగిన మహిళల టీ20 రేసును కల్లెడకు చెందిన జివాంజీ దీప్తి 57.84సెకన్లలో ముగించి పసిడి పతకాన్ని ముద్దాడింది. పురుషుల టీ37 విభాగంలో నర్సంపేట వాసి అకీరా నందన్ 52.06 సెకన్లలో రేసు పూర్తి చేసి స్వర్ణం ఖాతాలో వేసుకున్నాడు.
మరోవైపు పురుషుల టీ44 100మీటర్ల రేసులో పాలమూరుకు చెందిన కనకప్ప 12.99 సెకన్ల టైమింగ్‌తో కాంస్యం దక్కించుకోగా, లాంగ్‌జంప్‌లో ఆదిలాబాద్ పారా అథ్లెట్ అరిసెల్లి రవికిరణ్ 5.07మీటర్లతో రజతం సొంతం చేసుకున్నాడు. విజేతలను రాష్ర్ట పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సింగారపు బాబు, ప్రధాన కార్యదర్శి గాడిపల్లి ప్రశాంత్ అభినందించారు.