Jemimah Rodrigues : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలం మరో నాలుగు రోజుల్లో జరగనుంది. దాంతో వేలంలో ఎవరు ఎంత ధర పలుకుతారు? అనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. తాజాగా భారత ఆల్‌రౌండర్ జెమిమా రోడ్రిగ్స్ వేలం గురించి స్పందించింది. ‘మేమందరం తరచూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్) మ్యాచ్‌లు చూసేవాళ్లం. ఐపీఎల్ వేలం ప్రక్రియను ఆసక్తిగా గమనించేవాళ్లం. పురుష క్రికెటర్ల మాదిరిగా మాకు కూడా ఇలాంటి వేలం ఉంటే బాగుండు అని ఊహించుకునేవాళ్లం.
కానీ, ఇంతవరకు మేము వేలం అనుభూతికి లోనవ్వలేదు. ఒకవేళ మా కోసం వేలం జరిగితే అది మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. త్వరలో ప్రారంభం కానున్న మహిళల ప్రీమియర్ లీగ్ వేలం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. ఎందుకంటే.. ఇది మమిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ వేలం’ అని జెమిమా తెలిపింది. అంతేకాదు తన అభిమాన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అని, అతడి ఆట చూస్తూ పెరిగానని ఈ ఆల్‌రౌండర్ వెల్లడించింది.
క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో తాను ఎదుక్కొన్న కష్టాల గురించి కూడా జెమిమా చెప్పుకొచ్చింది. ‘నాకు క్రికెట్ ఆడడం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. అయితే.. అప్పట్లో మేము (ఆడవాళ్లం) క్రికెట్ ప్రాక్టీస్ చేసేందుకు మైదానాలు ఉండేవి కాదు. ముఖ్యంగా ఆడపిల్లలు క్రికెట్ ఆడడం అనేది మనదేశంలో ఒకప్పుడు ఎంతో కష్టం. అయితే.. ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని నేను చెప్పలేను. అయితే.. నాకు, మా నాన్నకు మహిళల క్రికెట్ ఉంటుందనే విషయమే తెలియదు. నా సంతోషం కోసం క్రికెట్ ఆడేదాన్ని. మా నాన్నే కోచ్‌గా వ్యవహరించాడు’ అని జెమీమ వెల్లడించింది.
బీసీసీఐ తొలిసారిగా నిర్వహిస్తోన్న మహిళల ప్రీమియర్ వేలం ఫిబ్రవరి 13న జరగనుంది. వేలంలో జెమిమా భారీ ధర పలికే అవకాశం ఉంది. కుడి చేతివాటం బ్యాటర్ అయిన జెమిమా 2018లో అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేసింది. 22 ఏళ్ల జెమీమ భారత్ తరఫున ఇప్పటి వరకూ 21 వన్డేలు, 75 టీ20లు ఆడింది. వన్డేల్లో 394, పొట్టి క్రికెట్లో 1,575 రన్స్ స్కోర్ చేసింది. జెమిమా ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ జట్టులో సభ్యురాలు. డబ్ల్యూపీఎల్ వేలానికి ముందు రోజే టీమిండియాకు కీలకమైన మ్యాచ్ ఉంది. ఫిబ్రవరి 12 భారత్, పాకిస్థాన్‌తో తలపడనుంది.