సిన్సినాటి: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌కు సన్నాహకంగా సాగుతున్న సిన్సినాటి టోర్నీలో వరల్డ్ నంబర్‌వన్ జానిక్ సిన్నర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సిన్నర్ 7-6(7-4), 6-2తో టెరెన్స్ అట్మెనె(ఫ్రాన్స్)పై అలవోక విజయం సాధించాడు. పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో సిన్నర్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు.
తొలి సెట్‌ను టైబ్రేక్‌లో దక్కించుకున్న సిన్నర్..మలిసెట్లో 6-2తో ప్రత్యర్థిని మట్టికరిపించాడు. 86 నిమిషాల పాటు సాగిన పోరులో సిన్నర్ 91 శాతం ఫస్ట్‌సర్వ్ ద్వారానే పాయింట్లు కొల్లగొట్టాడు. దీనికి తోడు ఐదింటిలో రెండింటిని బ్రేక్ పాయింట్లుగా మలుచుకున్నాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత బర్త్‌డే బాయ్ సిన్నర్ మాట్లాడుతూ ప్రతీసారి కొత్తవారితో ఆడేటప్పుడు కష్టంగా ఉంటుందంటూ వ్యాఖ్యానించాడు. మరో సెమీస్‌లో స్పెయిన్ నయాబుల్ కార్లోస్ అల్కరాజ్ 6-4, 6-3తో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై అద్భుత విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ సెమీస్‌లో రిబకినా, స్వియాటెక్ ముఖాముఖి తలపడనున్నారు.