Bhuvanagiri | యాదాద్రి భువనగిరి, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని న్యూ డైమెన్షన్ టెన్నిస్ అకాడమీలో రాజనర్సింహారావు స్మారక ఐటీఎఫ్ వరల్డ్ జూనియర్స్ అండర్ -18 టెన్నిస్ పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం బాల బాలికల విభాగాల్లో సింగిల్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగగా, మధ్యాహ్నం తర్వాత మెయిన్ డ్రా ఫస్ట్ రౌండ్ కొనసాగింది. బాలికల క్వాలిఫయింగ్ సింగిల్స్‌లో రంగినేని కీర్తన 6-0, 7-5తో అరవింద్ మీరా(ఆస్ట్రేలియా)పై, శాన్వి మిశ్రా 2-6, 6-0, 12-10తో సావర్ణిక విసనకపై గెలిచారు.
మెయిన్ డ్రాస్ ఫస్ట్ రౌండ్ సింగిల్స్‌లో వామికా శర్మ 6-3,6-2తో పల్లవి మిస్త్రిపై, సౌమిత్రి చటర్జీ 6-0, 6-0 తో శ్రీనిధి సాయిపై విజయం సాధించింది. బాలుర సెకండ్ రౌండ్ సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో అభిరాం 6-1, 6-2తో సిద్ధార్థపై, మోక్షత్ రెడ్డి 6-0, 6-0తో ప్రత్యుష్పై ఘన విజయం సాధించారు. బాలుర ఫైనల్ క్వాలిఫయింగ్‌లో అక్షత్ 7-6, 6-1తో అభిరామ్‌పై పై చేయి సాధించాడు. బాలుర మెయిన్ డ్రా ఫస్ట్‌రౌండ్ సింగిల్స్ లో అంకిత్ రాయ్ 6-4, 7-6తో మాన్యురెడ్డి తోట(యూఎస్ఏ)పై గెలిచాడు. మంగళవారం మెయిన్ డ్రా ఫస్ట్ రౌండ్ పూర్తయ్యాక, సెకండ్ రౌండ్ ప్రారంభం కానుంది. వచ్చే నెల ఒకటో తేదీ వరకు ఈ పోటీలు జరుగనున్నాయి.