EURO 2024 : గత రెండు ఫిఫా వరల్డ్ కప్(FIFA World Cup) పోటీలకు అర్హత సాధించలేకపోయిన ఇటలీ(Italy) కీలక మ్యాచ్‌లో సత్తా చాటింది. సోమవారం జర్మనీలో ఉక్రెయిన్(Ukraine)తో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్‌ను 0-0తో డ్రా చేసుకొని.. ప్రతిష్ఠాత్మక యూరో 2024 చాంపియన్‌షిప్ పోటీలకు క్వాలిఫై అయింది. ప్రస్తుతం గ్రూప్ ‘సీ’లో ఇటలీ రెండో స్థానంలో ఉండగా.. అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్ ఇప్పటికే యూరో 2024కు అర్హత సాధించింది. ప్రతి గ్రూప్‌లోని టాప్-2 జట్లు ఈ చాంపియన్‌షిప్ పోటీలకు నేరుగా క్వాలిఫై అవుతాయి. దాంతో, మూడో స్థానంలో నిలిచిన ఉక్రెయిన్‌కు చాన్స్ లేనట్టే.
‘మాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో అవరోధాలను అధిగమించి చివరకు మేము అనుకున్నది సాధించాం. కొత్త కోచ్‌కు, సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు’ అని మ్యాచ్ అనంతరం ఇటలీ కెప్టెన్, గోల్ కీపర్ గియన్లుగి డొన్నరుమ్మ(Gianluigi Donnarumma) అన్నాడు. ఇటలీతో పాటు తాజాగా స్లొవేనియా, చెక్‌రిపబ్లిక్ జట్లు కూడా ఈ టోర్నీకి అర్హత సాధించాయి. వచ్చే ఏడాది జూన్‌లో జర్మనీ వేదికగా యూరో 2024 చాంపియన్‌షిప్ ప్రారంభం కానుంది. యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఏటా నిర్వహించే ఈ టోర్నీలో మొత్తం 23 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి.