పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇటలీ కుర్రాడు యానిక్ సిన్నర్ జోరు కొనసాగుతున్నది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఒకటో సీడ్ సిన్నర్.. 6-1, 7-5, 6-0తో అలగ్జాండర్ బబ్లిక్ (కజకిస్థాన్)ను ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లాడు. ఈ టోర్నీలో ఎదురైన ప్రత్యర్థినల్లా మట్టికరిపిస్తూ సాగుతున్న సిన్నర్.. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా సెమీస్ చేరడం విశేషం. జొకోవిచ్-జ్వెరెవ్ మధ్య జరిగే క్వార్టర్స్‌లో గెలిచిన విజేతతో సిన్నర్ తలపడనున్నాడు. మొదటి సెమీస్‌లో లారెంజొ ముసెటి (ఇటలీ), అల్కరాజ్ (స్పెయిన్) అమీతుమీ తేల్చుకోనున్నారు. మహిళల విభాగంలో కోకో గాఫ్ (అమెరికా).. 6-7 (6/8), 6-4, 6-1తో అమెరికాకే చెందిన మాడిసన్ కీస్‌ను చిత్తు చేసి సెమీస్ చేరింది. సెమీస్‌లో ఆమె ఫ్రాన్స్ అమ్మాయి బొయిసన్తో అమీతుమీ తేల్చుకోనుంది.