న్యూఢిల్లీ: అధిక బరువు వల్ల రెజ్లర్ వినేశ్ ఫోగట్.. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో అనర్హతకు గురైన విషయం తెలిసిందే. అయితే ఆ అంశంపై భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష(PT Usha).. తాజాగా కామెంట్ చేశారు. బరువును ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే బాధ్యత అథ్లెట్లదే అని ఆమె పేర్కొన్నారు. మెడికల్ బృందాన్ని తప్పుపట్టడం సరికాదు అని ఆమె వెల్లడించారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పర్దివాలాను నిందించడం సరికాదు అని ఆమె పేర్కొన్నారు.
50 కేజీల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్ మ్యాచ్ ఫైనల్‌కు ముందు వంద గ్రాముల అధిక బరువు ఉన్న వినేశ్ ఫోగట్‌ను డిస్క్వాలిఫై చేశారు. దీంతో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ గోల్డ్ అందుకునే అవకాశాన్ని భారత్ కోల్పోయింది. ఈ ఘటన పట్ల నిందారోపణలు జరుగుతున్నాయి. పార్లమెంట్‌లోనూ ఈ అంశాన్ని లేవనెత్తారు. టీమ్ డాక్టర్ పర్దివాలా నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
వినేశ్ ఫోగట్ అనర్హత నేపథ్యంలో పీటీ ఉష స్పందిస్తూ.. రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బాక్సింగ్, జూడో లాంటి క్రీడల్లో బరువును మేనేజ్ చేసుకునే బాధ్యత అథ్లెట్ల, వాళ్ల కోచ్ వద్దే ఉంటుందని అన్నారు. ఐఓఏ నియమించిన మెడికల్ ఆఫీసర్లకు ఆ బాధ్యత ఉండదన్నారు. మెడికల్ టీమ్‌ను నిందించాలని అనుకుంటున్నవారు ముందుగా వాస్తవాలను తెలుసుకోవాలని ఆమె పేర్కొన్నారు.
పారిస్ క్రీడలకు వెళ్లిన ప్రతి భారతీయ అథ్లెట్‌కు సపోర్టు టీమ్ ఉందని, ఆ సపోర్ట్ టీమ్ వద్దే అథ్లెట్లు శిక్షణ పొందుతుంటారని, ఆ బృందాలు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నట్లు పీటీ ఉష తెలిపారు.