కైరో : ప్రతిష్టాత్మక ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ల పతక జోరు కొనసాగుతున్నది. సోమవారం జరిగిన మహిళల 25మీటర్ల పిస్టల్ టీమ్‌ఈవెంట్‌లో భారత త్రయం ఇషాసింగ్ (583), మనుభాకర్ (580), సురుచి ఇందర్‌సింగ్ (577) 1740 స్కోరుతో రజత పతకంతో మెరిసింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన తుదిపోరులో ఇషాసింగ్, మను భాకర్ అద్భుత ప్రదర్శన కనబరిచారు.
ఫైనల్‌కు ముందు జరిగిన అర్హత పోరులో ఇషా స్థాయికి తగ్గ ఆటతీరు కనబరిచింది. 13 ఏండ్ల వయసులోనే జాతీయ చాంపియన్ అయిన ఇషా 583 స్కోరుతో నాలుగో స్థానంతో ఫైనల్ బెర్తు దక్కించుకుంది. మరోవైపు డబుల్ ఒలింపియన్ మనుభాకర్ 580 స్కోరుతో ఆరో స్థానంతో తుది పోరులో నిలిచింది. 19 ఏండ్ల యువ షూటర్ సురుచి కూడా జతకలువడంతో భారత్‌కు వెండి పతకం ఖాయమైంది. అంతకుముందు జరిగిన 25మీటర్ల వ్యక్తిగత పోరులో ఇషాసింగ్, మనుభాకర్ పతకాలు దక్కించుకోలేకపోయారు.