మ్యూనిచ్ : ప్రతిష్టాత్మక ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత యువ షూటర్ సురుచి ఇందర్‌సింగ్ స్వర్ణ ధమాకాతో అదరగొట్టింది. వరుసగా మూడు ప్రపంచకప్ టోర్నీల్లో పసిడి పతకాలను దక్కించుకుని సత్తాచాటింది. ఇప్పటికే బ్యూనస్ ఎయిర్స్, లిమా మెగాటోర్నీల్లో స్వర్ణాలు సాధించిన సురుచి తాజాగా మ్యూనిచ్లోనూ అద్భుత ప్రదర్శనతో కదంతొక్కింది. శుక్రవారం జరిగిన మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 241.9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని ఖాతాలో వేసుకుంది.
ప్రత్యర్థుల నుంచి దీటైన పోటీని ఎదుర్కొంటూ ఆఖరి షాట్ వరకు తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. కామిల్లె జెద్రోవ్స్కీ(ఫ్రాన్స్, 241.7), యావో జినున్(చైనా, 221.7) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. అంతకుముందు జరిగిన అర్హత టోర్నీలో భారత్ తరఫున సురుచి(588), సైన్యుమ్(580) రెండు, ఐదు స్థానాల్లో నిలువగా, డబుల్ ఒలింపియన్ మను భాకర్ 25వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది. మెగాటోర్నీలో ప్రస్తుతం భారత్ స్వర్ణం, రెండు కాంస్యాలతో 4వ స్థానంలో కొనసాగుతున్నది.