IPL Auction 2024: ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) – 2024 మినీ వేలం ముగిసింది. ఐపీఎల్ చరిత్రలో ఇంతవరకూ లేనివిధంగా తొలిసారి ఇద్దరు క్రికెటర్లు రూ. 20 కోట్ల మార్కును దాటారు. ఆసీస్ పేస్ ద్వయం మిచెల్ స్టార్క్ గత రికార్డులను తిరగరాస్తూ ఏకంగా రూ. 24.75 కోట్లు దక్కించుకోగా, ఆ జట్టు సారథి పాట్ కమిన్స్ రూ. 20.50 కోట్లు సొంతం చేసుకున్నాడు. ఈ ఇద్దరినీ కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్‌లు దక్కించుకున్నాయి. ఈ ధరతో ఐపీఎల్-2023 వేలంలో ఇంగ్లండ్ ఆటగాడు సామ్ కరన్ అత్యధిక ధర (రూ. 18.5 కోట్లు) రికార్డును కమిన్స్, స్టార్క్‌లు బద్దలుకొట్టారు. వన్డే వరల్డ్ కప్‌లో తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న కివీస్ స్టార్ ఆల్ రౌండర్ డారెల్ మిచెల్ (రూ. 14 కోట్లు – సీఎస్కే) కూడా భారీగానే కొల్లగొట్టాడు. దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ గెరాల్డ్ కొయెట్జ్ ను ముంబై ఇండియన్స్ రూ. 5 కోట్లతో కొనుగోలు చేసింది.
విదేశీ క్రికెటర్ల తర్వాత ఫ్రాంచైజీలు దేశవాళీలో అదరగొడుతున్న అన్క్యాప్డ్ ప్లేయర్లకు వాళ్లు కలలో కూడా ఊహించని డబ్బును అందించాయి. సమీర్ రిజ్వి (రూ. 8.4 కోట్లు- చెన్నై), శుభమ్ దూబే (రూ. 5.8 కోట్లు- రాజస్తాన్), కుమార్ కుశాగ్రా (రూ. 7.2 కోట్లు – ఢిల్లీ), యశ్ ధుల్ (రూ. 5 కోట్లు – ఆర్సీబీ) రాబిన్ మింజ్ (రూ. 3.6 కోట్లు- గుజరాత్) లపైనా కాసులవర్షం కురిసింది. తమిళనాడు ఆల్ రౌండర్ షారుక్ ఖాన్‌ను గుజరాత్.. రూ. 7.4 కోట్లకు కొనుగోలు చేసింది.
17వ సీజన్లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన ఈ వేలంలో 77 స్థానాల కోసం 332 మంది ఆటగాళ్లు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇటీవలే వరల్డ్ కప్ గెలిచిన ఆసీస్ స్టార్ ప్లేయర్లతో పాటు ఆ టోర్నీలో సెమీస్ చేరిన న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా భారీ ధరను దక్కించుకున్నారు. భారీ ధర పలుకుతాడనుకున్న రచిన్ రవీంద్రను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 1.8 కోట్లకే దక్కించుకుంది. ముందు బౌలర్ల కోసం పోటాపోటీగా వేలంలో పాల్గొన్న ఫ్రాంచైజీలు తర్వాత దేశవాళీ ఆటగాళ్ల కోసం ఎగబడ్డాయి. ముఖ్యంగా బౌలర్ల కోసం అన్ని ఫ్రాంచైజీలు ఎంత దూరమైనా వెళ్లాయి. స్టార్క్, కమిన్స్, కొయెట్జ్, జాన్సన్, హర్షల్ పటేల్‌లకు దక్కిన ధరలే ఇందుకు నిదర్శనం.
ఇదీ వేలం కథ..
77 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి గాను వేలం నిర్వహించగా పది ఫ్రాంచైజీలు 72 ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇందులో 42 మంది భారత ఆటగాళ్లు కాగా 30 మంది ఓవర్సీస్ క్రికెటర్లు ఉన్నారు. పది ఫ్రాంచైజీలు కలిపి ఈ వేలంలో 72 బెర్తులపై 230.45 కోట్లు వెచ్చించాయి. కోల్‌కతా అత్యధికంగా రూ. 31.35 కోట్లను వేలంలో ఖర్చు చేసింది.
ఆసీస్ ఆటగాళ్లకు భలే గిరాకీ
ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ముఖ్యంగా బౌలర్లు మంచి ధర దక్కించుకున్నారు. స్టార్క్, కమిన్స్‌తో పాటు జై రిచర్డ్సన్ (రూ. 5 కోట్లు – ఢిల్లీ), స్పెన్సర్ జాన్సన్ (రూ. 10 కోట్లు – గుజరాత్)లు జాక్‌పాట్ కొట్టగా సీన్ అబాట్, రిలీ మెరిడిత్లు తలా కోటి రూపాయలు దక్కించుకున్నారు. వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్‌కు రూ. 6.80 కోట్లతో సన్ రైజర్స్ తరఫున ఆడనున్నాడు.
That’s a GRAND return to the IPL for Mitchell Starc 😎
DO NOT MISS the record-breaking bid of the left-arm pacer who will feature for @KKRiders 💜💪#IPLAuction | #IPL pic.twitter.com/D1A2wr2Ql3
— IndianPremierLeague (@IPL) December 19, 2023
భారత్ నుంచి..
వేలంలో భారత్ నుంచి అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడు హర్షల్ పటేల్. హర్షల్‌ను పంజాబ్ కింగ్స్.. రూ. 11.75 కోట్లకు సొంతం చేసుకుంది. భారీ ధర దక్కించుకుంటాడనుకున్న శార్దూల్ ఠాకూర్ ను సీఎస్కే రూ. 4 కోట్లతో సొంతం చేసుకుంది.
టాప్ – 5 బిడ్స్
– మిచెల్ స్టార్క్ – రూ. 24.75 కోట్లు
– పాట్ కమిన్స్ – రూ. 20.50 కోట్లు
– డారెల్ మిచెల్ – రూ. 14 కోట్లు
– హర్షల్ పటేల్ – రూ. 11.75 కోట్లు
– అల్జారీ జోసెఫ్ – రూ. 11.50 కోట్లు
Presenting the Top 5⃣ buys of #IPLAuction 2024 😎
Mitchell Starc tops the list with a whopping amount of INR 24.75 Crore 🔥#IPL pic.twitter.com/3ky8QsixV1
— IndianPremierLeague (@IPL) December 19, 2023