IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. లీగ్ దశ ముగియగా.. గురువారం నుంచి ప్లేఆఫ్ మ్యాచులు మొదలుకానున్నాయి. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్-రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య క్వాలిఫయర్-1 మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్‌కు పంజాబ్‌లోని ముల్లాన్‌పూర్ సిద్ధమైంది. ఈ స్టేడియంలో క్వాలిఫయర్-1 మ్యాచ్‌తో పాటు ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుండగా.. పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచులకు భద్రతా ఏర్పాట్లు భారీగా చేశామని.. మ్యాచ్‌కు ఎలాంటి ఆటంకాలు ఉండవని పంజాబ్ పోలీసులు పేర్కొన్నారు.
సవరించిన షెడ్యూల్ ప్రకారం.. క్వాలిఫయర్-1 మ్యాచ్ గురువారం జరుగనుండగా.. ఆ తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. క్వాలిఫయర్-2 మ్యాచ్‌తో పాటు ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరుగనున్నది. నేటి మ్యాచ్‌కు పంజాబ్ పోలీసులు 65 మంది పోలీసు అధికారులు, 2500 మందికిపైగా భద్రతా బలగాలను మోహరించింది. పంజాబ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) అర్పితా శుక్లా మాట్లాడుతూ ముల్లాన్‌పూర్ స్టేడియంలో రెండు కీలక మ్యాచులు జరుగుతాయని తెలిపారు. ఈ మ్యాచులకు దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు వచ్చే అవకాశం ఉందన్నారు. మ్యాచ్‌కు స్టేడియం లోపల, చుట్టూ విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. 65 మంది పోలీసు అధికారులు, 2500 మందికిపైగా జవాన్లను మోహరించినట్లు తెలిపారు. అభిమానులకు ఇబ్బంది కలుగకుండా చూస్తామన్నారు. అదే సమయంలో భద్రతా చర్యలు కఠినంగా ఉంటామన్నారు. మ్యాచ్‌కు ముందు మాక్ డ్రిల్ సైతం నిర్వహించినట్లు చెప్పారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఆ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దాంతో ఐపీఎల్‌ను వారం పాటు బీసీసీఐ నిలిపివేసింది. ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ఐపీఎల్ షెడ్యూల్‌ని మార్చింది. వాస్తవానికి క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచులు హైదరాబాద్‌లో.. క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్ కోల్‌కతాలో జరగాల్సి ఉంది. అయితే, షెడ్యూల్ మార్పు తర్వాత క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్‌ను ముల్లాన్‌పూర్, క్వాలిఫయర్-2తో పాటు ఫైనల్‌ను గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.