ముంబై: వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం త్వరలో జరగాల్సి ఉన్న మెగా వేలానికి ముందే పది ఫ్రాంచైజీలు ప్రకటించాల్సి ఉన్న రిటెన్షన్ జాబితాకు తుది గడువు ముంచుకొస్తోంది. అక్టోబర్ 31 సాయంత్రం 5 గంటల నాటికి ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్లతో పాటు వదిలేసే క్రికెటర్ల జాబితాను బీసీసీఐకి అందజేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఏ ఆటగాడిని రిటైన్ చేసుకోనుంది? ఎవరిని వదిలించుకోనుంది? ఏ ప్లేయర్ వేలంలోకి వెళ్లనున్నాడు? ఎవరు కోట్లు కొల్లగొట్టే అవకాశముంది? అన్న చర్చోపచర్చలు సాగుతున్నాయి. రిటెన్షన్ నిబంధనల ప్రకారం ప్రతి జట్టు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉండగా ఆయా జట్లు నిలుపుకోబోయే ఆ ఆరుగురు ఎవరు? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరికొన్ని గంటల్లో రిటెన్షన్ ప్లేయర్లపై స్పష్టత రానున్నప్పటికీ పలు ఫ్రాంచైజీలు ఇప్పటికే ఆ జాబితాను పూర్తిస్థాయిలో సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకునే ఫ్రాంచైజీలు పలువురు స్టార్ ప్లేయర్లను వేలానికి వదిలేయడమో లేక రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఆప్షన్ ద్వారా తిరిగి దక్కించుకోవాలనో చూస్తున్నాయి. వేలానికి వస్తారని అంచనా వేస్తున్న వారిలో రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్), రిషభ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్), కేఎల్ రాహుల్ (లక్నో సూపర్ జెయింట్స్) పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గతేడాది హార్దిక్‌ను సారథిగా నియమించిన ముంబై.. రోహిత్‌ను వదిలేస్తుందని గత కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అటు ముంబై గానీ ఇటు రోహిత్ గానీ బహిరంగంగా ఏ ప్రకటనా చేయలేదు. పంత్ వేలంలోకి వస్తే దక్కించుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ రెడీగా ఉన్నట్టు సీఎస్కే వర్గాల సమాచారం. ధోనీ ఐపీఎల్ కెరీర్ చరమాంకంలో ఉండటంతో ఆ జట్టు పంత్‌ను దక్కించుకుని వికెట్ కీపర్‌తో పాటు సారథ్య పగ్గాలు అప్పజెప్పుతుందని చర్చ జరుగుతోంది.
గత సీజన్ ఫైనలిస్టులు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆ జట్టు పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్, సారథి పాట్ కమిన్స్, అభిషేక్ శర్మను రిటైన్ చేసుకోనున్నట్టు వినికిడి. ట్రావిస్ హెడ్, నితీశ్ రెడ్డి కూడా జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది.
2022 సీజన్లో కేఎల్ రాహుల్‌కు భారీ ధర చెల్లించి సొంతం చేసుకోవడమే గాక సారథ్య పగ్గాలు అప్పగించిన లక్నో యాజమాన్యం.. అతడిని వదిలించుకునేందుకే సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. విండీస్ ఆటగాడు నికోలస్ పూరన్‌ను టాప్ రిటెన్షన్ (రూ.18 కోట్లు)గా యువ ఆటగాళ్లు రవి బిష్ణోయ్, అయూష్ బదోని, మోహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్‌ను మిగిలిన ఆప్షన్స్‌గా చేసినట్టు తెలుస్తోంది. గత మూడు సీజన్లలో రెండుసార్లు లక్నోను ప్లేఆఫ్స్ చేర్చినా 2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా లక్నో యజమాని సంజీవ్ గోయెంకా అందరూ చూస్తుండగానే రాహుల్‌పై దురుసుగా మాట్లాడటం వివాదాస్పదమైంది. అప్పుడే లక్నోను వదిలేసేందుకు రాహుల్ సిద్ధమైనట్టూ గుసగుసలు వినిపించాయి. ఒకవేళ అతడు వేలంలోకి వస్తే సొంతం చేసుకోవడానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.