18వ సారైనా.. స్టార్ ప్లేయర్లకు కొదవలేదు.. ఆటగాళ్ల పోరాట స్ఫూర్తి గురించి అనుమానమే అక్కర్లేదు.. అభిమానుల అండ ఆశించిన దానికంటే ఎక్కువ.. ఆకర్షణ పరంగా చూస్తే దేశంలో ఎక్కడ ఆడినా స్టేడియాలు నిండాల్సిందే.. ప్రపంచంలోనే మేటి బ్యాటర్లు, దిగ్గజ బౌలర్లు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించినా ఐపీఎల్ ఆరంభ సీజన్ మొదలుకుని నిరుడు ముగిసిన 17వ సీజన్ దాకా ఆ జట్టు ఒక్కటంటే ఒక్క కప్పు కూడా గెలవలేదు. ఆరు సార్లు ప్లేఆఫ్స్, మూడు సార్లు రన్నరప్ అయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఈ సీజన్ మరెంతో ప్రత్యేకం. ఢిల్లీలో పుట్టిపెరిగినా బెంగళూరు దత్తపుత్రుడైన కోహ్లీ (జెర్సీ నంబర్ 18).. ఐపీఎల్ టైటిల్ కల 18వ సీజన్లో అయినా నెరవేరుతుందా?
IPL | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభ సీజన్ నుంచి బరిలో ఉండి ఇప్పటి దాకా టైటిల్ నెగ్గని మూడు జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ముందు వరుసలో ఉంటుంది. ఈ జాబితాలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ సైతం ఉన్నప్పటికీ ఆర్సీబీ ఆకర్షణ, స్టార్ ప్లేయర్లు, అభిమానుల మద్దతు ప్రకారం చూస్తే.. మిగిలిన జట్ల కంటే ఎన్నో రెట్లు ముందుంటుంది. అయితే ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్టు ఆ జట్టు ఇప్పటిదాకా ఒక్కసారీ కప్పు కలను నెరవేర్చుకోలేదు. ప్రతి సీజన్ ఆరంభానికి ముందు ‘ఈసాలా కప్ నమ్దే’ అంటూ హంగామా చేసి అభిమానులకు నిరాశను మిగుల్చుతున్న బెంగళూరు 18వ సీజన్లో అయినా టైటిల్ నిరీక్షణకు తెరదించాలని భావిస్తోంది. అదే ఫ్రాంచైజీకి చెందిన స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ.. గత సీజన్లో కప్పు కొట్టడం అబ్బాయిలను మరింత ఒత్తిడికి లోనుచేస్తోంది. అన్నింటికీ మించి ఆ జట్టు దిగ్గజం విరాట్ కోహ్లీకి ఈ సీజన్ అత్యంత ప్రత్యేకం. కోహ్లీ జెర్సీ నంబర్ 18 కాగా ఐపీఎల్లో ఇది 18వ సీజన్. మరి కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ ఈసారైనా కన్నడిగుల ‘కప్ నమ్దే’ ఆశలను నెరవేరుస్తాడా? తన అభిమాన క్రికెటర్ కోహ్లీకి కప్పును కానుకగా ఇస్తాడా?
రాహుల్ ద్రావిడ్, కెవిన్ పీటర్సన్, అనిల్ కుంబ్లే, డేనియల్ వెటోరీ, విరాట్ కోహ్లీ, షేన్ వాట్సన్, ఫాఫ్ డుప్లెసిస్.. అంతర్జాతీయ క్రికెట్లో హేమాహేమీలుగా పేరొందిన ఈ దిగ్గజాలు సారథ్యం వహించిన ఆర్సీబీ ఈ సీజన్లో జట్టును పూర్తిగా ప్రక్షాళన చేసింది. ఆ జట్టు చరిత్రలో తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో అనుభవం లేని దేశవాళీ క్రికెటర్ రజత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు కట్టబెట్టింది. సారథ్య రేసులో కోహ్లీ ఉన్నా అతడు అందుకు విముఖత చూపడంతో భవిష్యత్ అవసరాల దృష్ట్యా రజత్‌కు నాయకత్వ పగ్గాలు అప్పజెప్పింది. ఈ నిర్ణయం ఆ జట్టు ట్యాగ్‌లైన్ ‘ప్లే బోల్డ్’ను సూచించేదే. అంతర్జాతీయ స్థాయిలో అనుభవం లేకున్నా రజత్‌కు దేశవాళీలో మధ్యప్రదేశ్ జట్టును విజయవంతంగా నడిపించిన అనుభవముంది. 2021 నుంచి బెంగళూరుకు ఆడుతున్న అతడికి జట్టులో ప్రతి ఆటగాడితోనూ సత్సంబంధాలున్నాయి. సీనియర్ కోహ్లీ నుంచి అతడికి పూర్తి మద్దతు ఉంటుందనడంలో సందేహమే లేదు. రజత్ నియామకం కంటే ముందే బెంగళూరు.. తమ ఆస్థాన బౌలర్ సిరాజ్‌తో పాటు గత మూడు సీజన్లలో ఆ జట్టుకు ఆడిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రిటైన్ చేసుకోకపోగా వారిని రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం)లో కూడా పట్టించుకోలేదు. వాళ్లను పక్కనబెట్టిన ఆర్సీబీ ఈసారి వేలంలో వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ (రూ. 11 కోట్లు), ఫిల్ సాల్ట్ (రూ. 11.50 కోట్లు), భువనేశ్వర్ కుమార్ (రూ. 10.75 కోట్లు), లివింగ్స్టన్ (రూ. 8.75 కోట్లు)ను భారీ ధరతో దక్కించుకుంది. రసిక్ ధార్, స్వప్నీల్, సుయాశ్ శర్మ వంటి దేశవాళీ ప్రతిభావంతులు ఆ జట్టు సొంతం.
గత సీజన్లో కేకేఆర్ ట్రోఫీ సాధించడంలో కీలకపాత్ర పోషించిన సాల్ట్ ఈసారి బెంగళూరుకు ఆడనుండటం ఆ జట్టుకు లాభించేదే. కోహ్లీతో కలిసి అతడు ఓపెనింగ్ చేసే అవకాశాలున్నాయి. ఆ తర్వాత పడిక్కల్, రజత్, జితేశ్ వచ్చినా ఆఖర్లో మెరుపులు మెరిపించేందుకు డేవిడ్, లివింగ్స్టన్ రూపంలో పటిష్టంగా ఉంది.
బెంగళూరు బలం, బలహీనత కోహ్లీనే. 17 సీజన్లలో ఒకే ఫ్రాంచైజీ తరఫున నిరాటంకంగా 267 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు (8,428) చేసిన క్రికెటర్‌గా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 8 శతకాలు, 57 అర్ధ శతకాలు అతడి సొంతం. లెక్కకు మిక్కిలి రికార్డులు కోహ్లీ ఖాతాలో ఉన్నాయి. కానీ కోహ్లీ తర్వాత ఆ జట్టు తరఫున భారత్ నుంచి వెయ్యి పరుగులు దాటిన బ్యాటర్ ఒక్క ద్రవిడ్ (1,132) మాత్రమే. ఈ 17 ఏండ్లలో ఎంతోమంది ఆర్సీబీ తరఫున ఆడినా నిలకడలేమితో విఫలమవుతున్నారు. పడిక్కల్ (884), పాటిదార్ (799) ఈ సీజన్లో అయినా ఆ లోటును పూడుస్తారేమో చూడాలి. కీలక మ్యాచ్‌లలో కోహ్లీ ఔట్ అయితే మిగిలిన బ్యాటింగ్ లైనప్ అంతా పెవిలియన్‌కు క్యూ కట్టడాన్ని నియంత్రిస్తే బెంగళూరుకు తిరుగుండదు. బ్యాటింగ్ బలంగా ఉన్నా బెంగళూరు బెంగ అంతా బౌలింగే. కానీ ఈసారి భువనేశ్వర్ వంటి సీమర్ చేరడం ఆ జట్టు పేస్ దళాన్ని పటిష్టం చేసేదే అయినా మిగతా స్టేడియాలతో పోల్చితే చిన్నగా ఉండే చిన్నస్వామిలో అతడు ఏ మేరకు విజయవంతమవుతాడనేది ఆసక్తికరం. హెజిల్వుడ్ గాయం కారణంగా ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడనేదీ స్పష్టత లేకపోవడం బెంగళూరును ఆందోళనకు గురిచేసేదే. గత సీజన్లో ఫర్వాలేదనిపించిన యశ్ దయాల్ 2025లోనూ రాణించడం ఆర్సీబీకి అత్యావశ్యకం.
2009, 2011, 2016 రన్నరప్
2010, 2020, 2021, 2022, 2024 ప్లేఆఫ్స్