కోల్‌కతా: ఐపీఎల్ 18వ సీజన్‌కు ఘనంగా తెరలేచింది. వరుణుడు అంతరాయం కల్గిస్తాడన్న వార్తలను పటాపంచలు చేస్తూ చారిత్రక ఈడెన్‌గార్డెన్స్‌లో ప్రారంభ కార్యక్రమం తారల తళుకుబెళుకుల మధ్య అట్టహాసంగా సాగింది. బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం అభిమాలను అమితంగా ఆకట్టుకుంది. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో స్టేజ్‌పైకి వచ్చిన షారుక్ తనదైన శైలిలో అలరించాడు. తొలుత ప్రముఖ గాయని శ్రేయా ఘోశల్ ఉషారెత్తించే పాటలతో స్టేడియం హోరెత్తిపోయింది.
పుష్ప-2 సినిమాలో వీడు మొరటోడు అంటూ పాడిన తెలుగు పాటకు ప్రేక్షకులు ఈలలు, కేరింతలతో ఊగిపోయారు. ఆ తర్వాత ప్రముఖ ర్యాపర్ కరణ్ ఔజ్లా పంజాబీ భాంగ్రా పాటలను అభిమానులు బాగా ఎంజాయ్ చేశారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ అదిరిపోయే స్టెప్పులతో ఆహా అనిపించింది. కండ్లు మిరుమిట్లు గొలిపే వెలుగు జిలుగుల మధ్య దిశ డ్యాన్స్ ఆహా అనిపించింది. షారుఖ్‌ఖాన్..రింకూసింగ్, కోహ్లీతో కలిసి సరదాగా డ్యాన్స్ చేశాడు. బీసీసీఐ ప్రతినిధులు స్టేజీ పైకి రాగా 18వ సీజన్ పురస్కరించుకుని విరాట్‌ను బోర్డు అధ్యక్షుడు రోజర్ బిన్ని జ్ఞాపిక అందజేశారు. ఆ తర్వాత కోల్‌కతా, బెంగళూరు కెప్టెన్లు రహానే, రజత్ పాటిదార్‌తో కలిసి బోర్డు ప్రతినిధులు పెద్ద కేక్ కట్‌చేశారు. ఈ సందర్భంగా స్టేడియంలో మిరుమిట్లు గొలిపే రీతిలో పటాకులు కోల్‌కతాకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. అటు పిమ్మట జాతీయ గీతాలాపన తర్వాత మ్యాచ్ మొదలైంది.