MS Dhoni | కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను సొంతమైదానంలోనే చెన్నై సూపర్‌కింగ్స్ రెండు వికెట్ల తేడాతో ఓడించి ఐపీఎల్లో మూడో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్ నుంచి నిష్క్రమించిన సీఎస్కే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి రిటైర్మెంట్పై ప్రశ్న ఎదురవగా.. భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. వారంతా తనపై చాలా ప్రేమను కురిపించారన్నారని తెలిపాడు. అయితే, తనకు ఏ సీజన్ చివరి సీజన్ అవుతుందో తెలియనది చెప్పాడు. అయితే, తన కెరీర్ చివరిదశలో ఉన్నానని ఒప్పుకున్నాడు. కానీ, వెంటనే రిటైర్ అయ్యే ఉద్దేశం లేదని.. రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. తనకు 43 సంవత్సరాల వయసు అని ఎవరూ మరచిపోవద్దని.. తాను చాలాకాలంగా క్రికెట్ ఆడుతున్నానని చెప్పాడు.
అభిమానుల తనపై చాలా ప్రేమను కురిపిస్తున్నారని.. వారిలో చాలా మందికి నా చివరి మ్యాచ్ ఎప్పుడు వస్తుందో తెలియదు (నవ్వుతూ) కాబట్టి తనను చూసేందుకు వస్తున్నారని పేర్కొన్నారు. తాను కెరీర్ చివరి దశలో ఉన్నాననేది వాస్తవమని.. దాని నుంచి తప్పించుకునే అవకాశం లేదని.. తాను రెండు నెలలు మాత్రమే ఆడతానని తెలిపాడు. ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాత మరో ఆరు నుంచి ఎనిమిది నెలలు కష్టపడాల్సి ఉంటుందని.. ఈ లీగ్ ఒత్తిడిని శరీరం తట్టుకోగలదా లేదా అని చూడాలని.. ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోలేదన్నాడు. కానీ, నేను చూసిన అభిమానుల ప్రేమ, ఆప్యాయత అద్భుతమైందని చెప్పాడు. ఈ సందర్భంగా సీఎస్కే జట్టును ధోనీ అభినందించాడు. కేకేఆర్‌పై జట్టు సాధించింది మాడో మ్యాచ్ మాత్రమేనని నవ్వుతూ తెలిపాడు. చాలా విషయాలను జట్టుకు అనుకూలంగా రాలేదని.. తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించాలని టీమ్ సభ్యులకు సూచించాడు.
జట్టులో 25 మంది ఉన్నారని.. ప్రస్తుతం ఈ విషయంపై దృష్టి పెట్టినట్లు తెలిపాడు. ఏ బ్యాట్స్‌మన్ ఎక్కడ.. ఎవరు ఎక్కడ బౌలర్ ఎక్కడ బౌలింగ్ చేయగలరు అనే దానికి వచ్చే ఏడాదికి సమాధానాలు కావాలన్నాడు. అందరూ పరుగులు చేయడం అరుదని.. కొన్ని సార్లు అవుట్ అవుతారని.. కానీ, ఎవరికి వారు విశ్వాసంతో ఉన్నప్పుడే పరుగులు రాబట్టరని చెప్పుకొచ్చాడు. బ్యాట్స్‌మెన్ అనుకున్న షాట్లు ఆడాలని సూచించాడు. శివం దూబేతో మైదానంలో జరిగిన చర్చపై మాట్లాడుతూ.. కేకేఆర్ స్పిన్నర్లు ఒత్తిడిని పెంచకుండా ఆపాలని చెప్పానని తెలిపాడు. బ్రేవిస్‌తో కలిసి దూబే కలిసి అదే పని చేశాడని గుర్తు చేశాడు. సునీల్, నరైన్‌లకు వికెట్లు ఇవ్వొద్దని.. అప్పుడు మనం ఎందుకు గెలవగలమో లేదో చూద్దామని చెప్పానని.. ఈడెన్‌గార్డెన్స్ పెద్ద మాదని కాదని.. మ్యాచ్ చివరి వరకు తీసుకెళ్లాలని సూచించినట్లు ధోనీ వివరించాడు.
ఇదిలా ఉండగా.. బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ అజింక్య రహానె (48), ఆండ్రీ రస్సెల్ (38), మనీష్ పాండే (36 నాటౌట్) పర్వాలేదనిపించడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన చెన్నై 60 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. డెవాల్డ్ బ్రెవిస్ (52 పరుగులు, 25 బంతులు, నాలుగు సిక్సర్లు, నాలుగు ఫోర్లు) అర్ధ సెంచరీ, శివమ్ దూబే (45 పరుగులు, 40 బంతులు, మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు)తో ఆరో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో 19.4 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసి విజయం సాధించింది. చెన్నైపై ఓటమితో కేకేఆర్ ప్లేఆఫ్ ఆశలు మరింత సంక్లిష్టంగా మారాయి. తర్వాత రెండు మ్యాచ్‌లు కీలకంగా మారాయి. ఈ నెల 10న సన్‌రైజర్స్ హైదరాబాద్, మే 17న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చెన్నై జట్టు తర్వాత మ్యాచ్‌ని 12న రాజస్థాన్ రాయల్స్‌తో, 18న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనున్నది.