IPL 2025 auction : భారత స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కోసం ఐపీఎల్ 2025 వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ భారీగా వెచ్చించింది. ఏకంగా రూ.10.75 కోట్లకు భువీని కొనుగోలు చేసింది. ఆ మేరకు భువనేశ్వర్ కుమార్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కాగా భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ కెరీర్ 2009లో ప్రారంభమైంది. వరుసగా రెండు సీజన్లలో భువీని ఆర్సీబీ కొనుగోలు చేసింది. కానీ అతనికి ఆ రెండు సీజన్లలో ఏ ఒక్క మ్యాచ్‌లో కూడా తుది జట్టులో చోటు దక్కలేదు.
అయితే 2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చిన తర్వాత అతని దశ తిరిగింది. 2016, 2017 సీజన్లలో అద్భుతమైన ఆటతీరుతో వరుసగా పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి ఐపీఎల్ టైటిల్ దక్కించుకోవడంలో భువీ కీలకపాత్ర పోషించాడు. ఈసారి ఐపీఎల్ వేలానికి ముందు అతను టీమ్ నుంచి రిలీవ్ అయ్యాడు. వేలంలో ఆర్సీబీ అతడిని కొనుగోలు చేసింది.
మరోవైపు భారత యువ ఆటగాళ్లు దీపక్ చాహర్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ పాండే కూడా ఈ ఐపీఎల్ వేలంలో భారీ ధర పలికారు. దీపక్ చాహర్‌ను పంజాబ్, చెన్నైలతో పోటీపడి చివరికి ముంబై ఇండియన్స్ జట్టు సొంతం చేసుకుంది. అతని కోసం రూ.9.25 కోట్లు వెచ్చించింది. ముకేశ్ కుమార్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ రూ.8 కోట్లు ఖర్చు చేసింది. తుషార్ దేశ్ పాండేను రాజస్థాన్ రాయల్స్ రూ.6.50 కోట్లకు కొనుగోలు చేసింది. జోష్ ఇంగ్లిష్‌ను పంజాబ్ కింగ్స్ టీమ్ రూ.2.60 కోట్లకు దక్కించుకుంది.