IPL 2024 | గడిచిన నెల రోజుల్లో రెండుసార్లు గాయపడ్డ బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్.. వాటిని లెక్కచేయకుండా ఐపీఎల్ ఆడేందుకు చెన్నైకి వచ్చేశాడు. కొద్దిరోజుల క్రితమే బంగ్లాదేశ్‌లో ముగిసిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో తలకు గాయమైన ముస్తాఫిజుర్.. సోమవారం శ్రీలంకతో ముగిసిన మూడో వన్డేలో తొడ కండరాల గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. నిన్న అతడు కాలిగాయం తట్టుకోలేక ఫీల్డ్ లోనే పడిపోవడంతో ముస్తాఫిజుర్‌ను స్ట్రెచర్ మీద డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లాల్సి వచ్చింది. నిన్న గాయంతో విలవిల్లాడిన అతడు.. నేడు చెన్నై క్యాంప్‌లో చేరడం గమనార్హం.
బీపీఎల్‌లో ముస్తాఫిజుర్.. ప్రాక్టీస్ చేస్తుండగా తలకు గాయమై సుమారు వారం రోజుల పాటు ఈ లీగ్‌కు దూరమయ్యాడు. అయితే స్వదేశంలో శ్రీలంకతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ నాటికి కోలుకున్న అతడు టీ20లతో పాటు వన్డే సిరీస్ కూడా ఆడాడు. సోమవారం గాయంతో అసలు ముస్తాఫిజుర్ ఐపీఎల్ ఆరంభం నాటికి కోలుకుంటాడా..? చెన్నైకి మరో షాక్ తప్పదా..? అన్న అనుమానాలు వినిపించాయి. కానీ మంగళవారం ఉదయం అతడు చెన్నైలో ల్యాండ్ అవడమే గాక టీమ్‌తో కలిశాడు.
Whistle Vanakkam, @Mustafiz90! 🙌#WhistlePodu #DenComing pic.twitter.com/KGGzd3LTSg
— Chennai Super Kings (@ChennaiIPL) March 19, 2024
గత సీజన్ వరకూ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉన్న ముస్తాఫిజుర్ ఈ సీజన్లో చెన్నైకి ఆడనున్నాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్టు అయిన ఈ బంగ్లాదేశ్ పేసర్.. సీఎస్కేకు కీలకం కానున్నాడు. ఇప్పటికే ఆ జట్టు లంక యువ సంచలనం మతీశ పతిరాన సేవలను కోల్పోయిన నేపథ్యంలో డెత్ ఓవర్లలో ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? అన్న అనుమానం ఆ జట్టు అభిమానుల్లో నెలకొనగా ముస్తాఫిజుర్ దానికి మంచి ఆప్షన్‌గా ఉన్నాడు. మరి అతడు పూర్తిస్థాయిలో కోలుకున్నాడా..? లేక జట్టుతో మాత్రమే జాయిన్ అయి ఇక్కడ రెస్ట్ తీసుకుంటాడా..? అన్నది త్వరలోనే తేలనుంది. ఐపీఎల్ – 17 ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. ఈనెల 22న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.
Mustafizur Rahman for CSK 💛💛💛💛💛💛 pic.twitter.com/CFTgyDNR4G
— R O H I T H (@Rohithkanna1130) March 19, 2024