INDvsSA 2nd Test: భారత్ – దక్షిణాఫ్రికా మధ్య కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న కీలక టెస్టులో సఫారీ సారథి డీన్ ఎల్గర్ టాస్ నెగ్గాడు. తన కెరీర్లో ఆఖరి టెస్టు ఆడుతున్న ఎల్గర్ టాస్ గెలిచిన వెంటనే మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ బౌలింగ్‌కు రానుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇదివరకే సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సఫారీలు భారీ విజయం సాధించిన నేపథ్యంలో కేప్‌టౌన్‌లో గెలిస్తేనే భారత్ సిరీస్‌ను డ్రా చేసుకుంటుంది. మ్యాచ్ డ్రా అయినా లేక ఓడినా సిరీస్ సఫారీల సొంతం అవడం ఖాయం. సఫారీ సారథి డీన్ ఎల్గర్‌కు ఇది చివరి టెస్టు కావడంతో దక్షిణాఫ్రికా కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి అతడికి ఘనమైన వీడ్కోలు చెప్పాలని భావిస్తున్నది.
ఇరుజట్లకూ కీలకంగా మారిన ఈ మ్యాచ్‌లో భారత జట్టులో రెండు మార్పులు జరిగాయి. శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో పేసర్ ముఖేష్ కుమార్, స్పిన్నర్ రవీంద్ర జడేజాలు తుదిజట్టులోకి వచ్చారు. సఫారీ జట్టులో బవుమా స్థానంలో ట్రిస్టన్ స్టబ్స్ అరంగేట్రం చేస్తున్నాడు. కొయెట్జ్ గాయపడటంతో అతడి స్థానంలో స్పిన్నర్ కేశవ్ మహారాజ్ జట్టులోకి వచ్చాడు.
కేప్‌టౌన్‌లో భారత్ ఇంతవరకూ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. గతేడాది కూడా భారత్‌కు ఇక్కడ పరాభవం తప్పలేదు. రెండో టెస్టుతో అయినా గెలిచి ఇక్కడ తొలి విజయం సాధించాలని భారత్ ఉవ్విళ్లూరుతున్నది. తొలి టెస్టులో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా విఫలమైన టీమిండియా.. కేప్‌టౌన్‌లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ముఖేశ్ కుమార్ జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ
దక్షిణాఫ్రికా : ఎయిడెన్ మార్క్రమ్, డీన్ ఎల్గర్ (కెప్టెన్), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హమ్, కైల్ వెరీన్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసొ రబాడ, నండ్రె బర్గర్, లుంగి ఎంగిడి