INDvsAUS T20I: కుర్రాళ్లు కుమ్మేశారు.. రెండో టీ20 భారత్‌దే..
INDvsAUS T20I: ఇదివరకే వైజాగ్ టీ20లో గెలిచిన భారత్.. తాజా విజయంతో సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత్ నిర్దేశించిన 236 పరుగులను ఛేదించే క్రమంలో ఆసీస్.. 191 పరుగులకే పరిమితమైంది.
INDvsAUS T20I: వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియాపై ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన టీమిండియా రెండో టీ20లో కూడా అదరగొట్టింది. తిరువనంతపురం వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన మ్యాచ్‌లో టీమిండియా.. 44 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇదివరకే వైజాగ్ టీ20లో గెలిచిన భారత్.. తాజా విజయంతో సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత్ నిర్దేశించిన 236 పరుగులను ఛేదించే క్రమంలో ఆసీస్.. 9 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో మార్కస్ స్టోయినిస్ (25 బంతుల్లో 45, 2 ఫోర్లు, 4 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (22 బంతుల్లో 37, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడారు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి కంగారూలను మట్టికరిపించారు.
ఆదిలోనే షాకులు..
236 పరుగుల ఛేదనను ఆసీస్ ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరంభించింది. ఓపెనర్లు స్మీవ్ స్మిత్ (16 బంతుల్లో 19, 1 ఫోర్, 1 సిక్స్), మాథ్యూ షార్ట్ (10 బంతుల్లో 19, 3 ఫోర్లు) 2.5 ఓవర్లలోనే 35 పరుగులు చేశారు. ఈ జోడీని రవి బిష్ణోయ్ విడదీశాడు. అతడు వేసిన మూడో ఓవర్లో ఐదో బంతికి షార్ట్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరుసటి ఓవర్లో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో జోష్ ఇంగ్లిస్ (2) ను తిలక్ వర్మ సూపర్ డైవింగ్ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. అక్షర్ పటేల్ వేసిన ఆరో ఓవర్లో 4, 6 బాదిన గ్లెన్ మ్యాక్స్‌వెల్.. అదే ఓవర్లో ఐదో బంతికి జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 8వ ఓవర్ వేసిన ప్రసిధ్ కృష్ణ.. స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేయడంతో ఆసీస్ 8 ఓవర్లలో నాలుగు కీలక వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది.
డేవిడ్-స్టోయినిస్ షో..
భారీ ఛేదనలో త్వరత్వరగా వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఇన్నింగ్స్‌ను టిమ్ డేవిడ్, మార్కస్ ప్టోయినిస్ గాడిలో పెట్టారు. ఈ ఇద్దరూ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. బిష్ణోయ్ వేసిన తొమ్మిదో ఓవర్లో స్టోయినిస్ రెండు భారీ సిక్సర్లు బాదాడు. ముఖేశ్ కుమార్ వేసిన పదో ఓవర్లో డేవిడ్.. 4, 4, 4, 6 కొట్టి ఆ ఓవర్లో 22 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఆసీస్ స్కోరు పది ఓవర్లలోనే వంద పరుగులు దాటింది. అర్ష్‌దీప్ వేసిన 12వ ఓవర్లో స్టోయినిస్.. రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని బిష్ణోయ్ విడదీసి భారత్‌ను తిరిగి పోటీలోకి తెచ్చాడు. అతడు వేసిన 14వ ఓవర్లో తొలి బంతికి ఫోర్ కొట్టిన డేవిడ్.. మూడో బంతికి లాంగాన్‌లో రుతురాజ్ చేతికి చిక్కడంతో 81 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ మరుసటి ఓవర్లో స్టోయినిస్‌ను ముఖేశ్ కుమార్ ఔట్ చేసి మ్యాచ్‌పై భారత్ పూర్తి నియంత్రణ సాధించేలా చేశాడు.
స్టోయినిస్ నిష్క్రమణతో ఆసీస్ పతనం వేగంగా సాగింది. సీన్ అబాట్ (1), నాథన్ ఎల్లిస్ (1), ఆడమ్ జంపా (1)లు అలా వచ్చి ఇలా వెళ్లారు. క్రమంగా వికెట్లు కోల్పోవడంతో కెప్టెన్ మాథ్యూ వేడ్ (23 బంతుల్లో 42 నాటౌట్, 1 ఫోర్, 4 సిక్సర్లు) పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించడానికే పనికొచ్చింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, ప్రసిధ్ కృష్ణ తలా మూడు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ (53), రుతురాజ్ గైక్వాడ్ (58), ఇషాన్ కిషన్ (52), రింకూ సింగ్ (31 నాటౌట్) రాణించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

