Indigo Gift to Neeraj Chopra | టోక్యో ఓలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. అంతేకాదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు బహుమతులు ప్రకటిస్తున్నాయి. తాజాగా బడ్జెట్ కారియర్ ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా ఆ జాబితాలో చేరింది. విశ్వ క్రీడా వేదికపై మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా ఎగురవేసిన నీరజ్ చోప్రాకు ఏడాది పాటు అపరిమితంగా ప్రయాణ టిక్కెట్లు ఇవ్వనున్నట్లు శనివారం ప్రకటించింది.
మెన్స్ జావెలిన్ త్రో ఫైనల్స్‌లో పసిడి పతకాన్ని సాధించినందుకు గుర్తింపుగా ఈ బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి వచ్చే ఏడాది ఆగస్టు ఏడో తేదీ వరకు అపరిమితంగా విమాన ప్రయాణ టిక్కెట్లు ఉచితంగా అందజేస్తామని పేర్కొంది.
ఇండిగో సీఈవో కం హోల్‌టైం డైరెక్టర్ రొనోజోయ్ దత్తా ఈ సందర్భంగా స్పందిస్తూ.. నీరజ్.. మీరు సాధించిన విజయం పట్ల మేం చాలా సంతోషంగా ఉన్నాం. మీరు దేశానికి గర్వకారణం. మా విమానాల్లో మీరు ప్రయాణించడానికి స్వాగతం పలుకుతున్నాం. మీకు ఏడాది పాటు ఉచితంగా విమాన ప్రయాణ టిక్కెట్లు ఇస్తామని వినయంతో తెలియజేస్తున్నాం. కష్టపడితే విజయం సాధించొచ్చునని మీరు రుజువు చేశారు.. భవిష్యత్ భారత అథ్లెట్లకు మీరే టార్చ్ బేర్‌గా ఉంటారు.. వెల్డన్ నీరజ్.. అని పేర్కొన్నారు.