నోవీ సాద్(సెర్బియా): ప్రతిష్టాత్మక అండర్-23 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు తమ సత్తాచాటుతున్నారు. భారత టాప్ రెజ్లర్లలో ఒకడిగా కొనసాగుతున్న సుజిత్ కల్కాల్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన పురుషుల 65కిలోల సెమీస్ బౌట్లో సుజిత్ 3-2తో యుటో నిశుషిపై అద్భుత విజయం సాధించాడు. బౌట్ మరికొన్ని క్షణాల్లో ముగుస్తుందనగా సుజిత్ పట్టు విజయం వైపు నిలిపింది. అప్పటి వరకు 1-2తో వెనుకంజలో ఉన్న సుజిత్.. బౌట్ పూర్తి కావడానికి మూడు సెకన్ల దూరంలో లెగ్ అటాక్‌తో జపాన్ రెజ్లర్‌ను కట్టిపడేశాడు.
ఈ టోర్నీలో అంతకుముందు జరిగిన వేర్వేరు బౌట్లలోనూ ఈ యువ రెజ్లర్ ఫిదోర్ కెవాద్రి(12-2), డొమినిక్ జాకబ్(11-0)తో అలవోక విజయాలు సాధించాడు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ప్రపంచ టైటిల్ గెలువని సుజిత్ ఖాతాలో రెండు అండర్-23 ఏషియన్ టైటిళ్లతో పాటు అండర్-20 ఏషియన్ చాంపియన్‌షిప్ స్వర్ణం ఉంది. మరోవైపు శుభమ్(61కి), అశిష్(86కి), వికీ(97కి) ప్రత్యర్థుల చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు.