హంగ్జౌ(చైనా): మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీని భారత్ రెండో స్థానంతో ముగించింది. ఆదివారం జరిగిన టోర్నీ ఫైనల్లో భారత్ 1-4 తేడాతో ఆతిథ్య చైనా చేతిలో ఓటమిపాలైంది. ఆదిలో ఆధిక్యం దక్కించుకున్న మన అమ్మాయిలు చైనా ఎదురుదాడితో ఓటమి వైపు నిలువాల్సి వచ్చింది. నవనీత్‌కౌర్(1ని) భారత్‌కు ఏకైక గోల్ అందించగా, జిజియా యు(21ని), హాంగ్ లీ(41ని), మిరాంగ్ జు(51ని), జైకి జాంగ్(53ని) చైనా విజయంలో కీలకమయ్యారు. మూడోసారి ఆసియా టైటిల్ దక్కించుకున్న చైనా వచ్చే ఏడాది బెల్జియం-నెదర్లాండ్స్ వేదికగా జరిగే హాకీ ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధించింది. మూడు, నాలుగు స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్‌లో జపాన్ 2-1తో కొరియాపై గెలిచింది. భారత్, చైనా మ్యాచ్ విషయానికొస్తే మ్యాచ్ మొదలైన తొలి నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్‌ను నవనీత్‌కౌర్ గోల్‌గా మలువడంతో భారత్ 1-0 ఆధిక్యం దక్కించుకుంది.
మూడు నిమిషాల తేడాతో చైనాకు వరుసగా వచ్చిన పెనాల్టీ కార్నర్ అవకాశాలను భారత్ దీటుగా తిప్పికొట్టింది. స్కోరు సమం చేసేందుకు చైనా స్ట్రైకర్లు భారత్‌పై నిరవధికంగా దాడులు చేసినా లాభం లేకపోయింది. అయితే రెండో క్వార్టర్ మొదట్లో ఎట్టకేలకు సఫలమైన చైనా తొలి గోల్ కొట్టడంతో స్కోరు 1-1తో సమమైంది. ఇక్కణ్నుంచి చైనా తమ దాడులకు మరింత పదునుపెట్టింది. భారత డిఫెన్స్‌ను ఒత్తిడిలోకి నెడుతూ గోల్ చేసే ప్రయత్నం చేసింది. మూడో క్వార్టర్లో టీమ్ఇండియా పుంజుకునే ప్రయత్నం చేసినా అది నెరవేరలేదు. ఆఖర్లో రెండు నిమిషాల తేడాతో రెండు గోల్స్ చేసిన చైనా మ్యాచ్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. మరోవైపు పటిష్టమైన చైనా డిఫెన్స్‌ను చేధించలేకపోయిన భారత్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.