Sumit Nagal | ఢిల్లీ: భారత టెన్నిస్ యువ సంచలనం సుమిత్ నాగల్ కెరీర్ బెస్టు ర్యాంకు సాధించాడు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) తాజాగా ప్రకటించిన ర్యాంకులలో నాగల్.. 18 స్థానాలు ఎగబాకి 713 ఏటీపీ పాయింట్లతో 77వ ర్యాంకుకు చేరాడు. ఆదివారం జర్మనీ వేదికగా ముగిసిన హీల్బ్రోన్ నెకర్‌కప్ చాలెంజర్ ఈవెంట్లో టైటిల్ నెగ్గడంతో నాగల్ ర్యాంకు మెరుగుపడింది. దీంతో అతడు రాబోయే పారిస్ ఒలింపిక్స్‌లో సింగిల్స్ విభాగంలో భారత్ తరఫున పాల్గొనేందుకు కోటానూ దక్కించుకున్నట్టే. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ నెగ్గిన ఇటలీ కుర్రాడు జానిక్ సిన్నర్.. నొవాక్ జొకోవిచ్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానం దక్కించుకున్నాడు. 1973 నుంచి ఏటీపీ ర్యాంకులు మొదలవగా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన తొలి ఇటలీ ప్లేయర్‌గా సిన్నర్ రికార్డులకెక్కాడు. అల్కారజ్ 2వ ర్యాంక్‌కు ఎగబాకగా తర్వాతి స్థానాల్లో జొకో, జ్వెరెవ్ ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో ఇగా స్వియాటెక్ నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతోంది.