PV Sindhu | న్యూఢిల్లీ: గత కొంతకాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరో టోర్నీకి సిద్ధమైంది. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న కెనడా ఓపెన్‌లో సింధుతో పాటు లక్ష్యసేన్ సత్తాచాటేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ జరుగనున్న నేపథ్యంలో ర్యాంకింగ్ పాయింట్స్ సాధించాలనే లక్ష్యంతో వీరు ఈ టోర్నీ బరిలో దిగనున్నారు.
నిరుడు బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన అనంతరం గాయపడ్డ సింధు పూర్తిస్థాయిలో కోలుకోగా.. లక్ష్యసేన్ కూడా గాయాల బెడద దాటుకొని రాణించేందుకు సిద్ధమయ్యాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తాలియాతో సింధు తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ వితిద్సరన్తో లక్ష్యసేన్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. పురుషుల డబుల్స్‌లో కృష్ణ ప్రసాద్-విష్ణువర్ధన్ జంట తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.