Pankaj Advani | న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఐబీఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ టోర్నీలో భారత స్టార్ క్యూయిస్టు పంకజ్ అద్వానీ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తద్వారా 28వ ప్రపంచ టైటిల్‌కు పంకజ్ మరింత చేరువయ్యాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్ 4-2 తేడాతో భారత్‌కే చెందిన సౌరవ్ కొఠారిపై విజయం సాధించాడు. ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన ఈ స్టార్ క్యూయిస్టు తొలి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు.
రెండో గేమ్‌ను సౌరవ్ సొంతం చేసుకోగా, వరుసగా రెండు గేములు గెలిచి పంకజ్ 3-1 ఆధిక్యం కనబరిచాడు. మళ్లీ పుంజుకున్న సౌరవ్ మరో గేమ్ గెలిచి పోటీలోకి రాగా, తన అనుభవాన్ని ఉపయోగించుకుంటూ అద్వానీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో ఇంగ్లండ్‌కు చెందిన రాబర్ట్ హాల్‌తో అద్వానీ తలపడనున్నాడు.