టోక్యో : డెఫ్లింపిక్స్లో భారత షూటర్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. టోక్యోలో జరుగుతున్న ఈ మెగా టోర్నీ 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ అభినవ్ దేశ్వాల్ పసిడి గెలిచాడు. ఫైనల్లో అతడు 50కి గాను 44 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. దక్షిణకొరియా షూటర్ లీ సియాంగ్ (43) రజతం సాధించాడు.
ఈ టోర్నీలో అభినవ్‌కు ఇది మూడో పతకం కాగా వ్యక్తిగత ఈవెంట్ల (అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లోనూ)లో రెండోవది. ఇప్పటిదాకా షూటర్లు 7 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్యాల (మొత్తంగా 16 పతకాలు)తో సత్తాచాటారు. షూటర్ల స్ఫూర్తితో ఇద్దరు రెజ్లర్లు (అమిత్ కృష్ణన్, సుమిత్ దహియా) సైతం ఫైనల్స్‌కు చేరి కనీసం రజతాలు ఖాయం చేయగా ఘన్‌శ్యామ్ కాంస్య పోరులో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.