న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో ఇటీవల భారత్ టెస్టు సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. ఆ సిరీస్‌లో టీమిండియా దారుణంగా ఓడింది. అయితే ఆ సిరీస్‌లో పాల్గొనేందుకు వెళ్లిన ఓ టీమిండియా మేటి క్రికెటర్(Indian Cricketer).. తన వెంట భారీ స్థాయిలో లగేజీ మోసుకెళ్లాడు. అతను ఆ టూర్ కోసం 27 బ్యాగులు తీసుకెళ్లినట్లు ఓ పత్రికాకథనం ద్వారా తెలిసింది. అయితే బీసీసీఐ ట్రావల్ పరిమితి రూల్స్‌ను ఆ క్రికెటర్ అధిగమించినట్లు తెలిసింది. ఆ బ్యాగుల బరువు సుమారు 250 కేజీలు ఉంటుందని అంచనా వేశారు.
వాస్తవానికి విదేశీ టూర్లకు వెళ్లే క్రికెటర్లకు వంద కేజీల వరకే లగేజీ పరిమితం ఉంటుంది. కానీ ఆసీస్ టూర్‌కు ఓ పెద్ద ప్లేయర్ అదనంగా 150 కేజీల బరువు మోసుకెళ్లాడు. దీంట్లో అతనికి చెందిన బ్యాట్లతో పాటు ఫ్యామిలీ సభ్యుల బ్యాగులు కూడా ఉన్నాయి. ఆ క్రికెటర్ బ్యాగుల్లో 17 బ్యాట్లు ఉన్నాయి. ఇంకా పర్సనల్ స్టాఫ్‌కు చెందిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. బీసీసీఐ రూల్స్ ప్రకారం.. ప్లేయర్ల కుటుంబీకులు, పర్సనల్ స్టాఫ్ లగేజీ వ్యక్తిగతంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఇక టూర్ సాగినన్ని రోజులూ ఆ ప్లేయర్ ఫ్యామిలీ కూడా అతనే వెంటే ఉన్నది. దీంతో ఆ ప్లేయర్ ఫ్యామిలీ సభ్యుల ఖర్చు కూడా బీసీసీఐ చెల్లించాల్సి వచ్చింది. ఈ ప్రక్రియ వల్ల బీసీసీఐ కొన్ని లక్షల్లో అధిక బిల్లులు కట్టింది. మిగితా క్రికెటర్లు కూడా ఆ స్టార్ ప్లేయర్ బాట పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో.. తాజాగా బీసీసీఐ కొత్త ట్రావెల్ పాలసీని తీసుకువచ్చింది. ప్లేయర్లు ఎవరైనా టీం బస్సులోనే వెళ్లాలని పేర్కొన్నది. విదేశీ టూరు 45 రోజుల షెడ్యూల్ దాటితేనే.. ఆ క్రికెటర్‌తో ఫ్యామిలీ వెళ్లేందుకు అనుమతి ఇవ్వనున్నారు.