భువనేశ్వర్: వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న భారత మహిళల హాకీ జట్టు.. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంచలన విజయం సాధించింది. ఒలింపిక్ చాంపియన్స్, ప్రపంచ నంబర్‌వన్ జట్టు అయిన నెదర్లాండ్స్‌ను షూటౌట్లో ఓడించి సోమవారం ఇదే జట్టుపై కలిగిన పరాభవానికి బదులు తీర్చుకుంది. మ్యాచ్‌లో నిర్దేశిత సమయానికి స్కోర్లు 2-2తో సమమవగా పోరు షూటౌట్‌కు దారితీసింది. షూటౌట్లో భారత్ 2-1తో డచ్ జట్టుకు షాకిచ్చింది. డచ్ తరఫున సాండర్స్ (17ని.), ఫే వాన్ డర్ (28ని.) రెండు గోల్స్ చేసి తొలి అర్ధభాగం ముగిసే సరికి 2-0 ఆధిక్యంలో నిలిచారు. కానీ థర్డ్ క్వార్టర్లో దీపికా (35ని), బాలాజీ కౌర్ (43ని.) తలా ఓ గోల్ చేయడంతో స్కోర్లు సమమయ్యాయి. షూటౌట్లో దీపికా, ముంతాజ్ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించగా.. నెదర్లాండ్స్ నుంచి మరిన్ వీన్ మాత్రమే గోల్ చేయడంలో సఫలమైంది. పురుషుల విభాగంలో భారత్.. 2-1తో ఇంగ్లండ్‌ను చిత్తుచేసింది.